HILT Policy : ‘హిల్ట్’ పేరుతో రేవంత్ కొత్త దందా – కేటీఆర్ సంచలన ఆరోపణలు
HILT Policy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్డ్ పాలసీ (HILTP - Housing in Industrial Land Transfer Policy) పేరుతో భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు
- By Sudheer Published Date - 02:00 PM, Thu - 4 December 25
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్డ్ పాలసీ (HILTP – Housing in Industrial Land Transfer Policy) పేరుతో భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. ఈ విధానం ద్వారా సుమారు రూ. 5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాల కోసం కేటాయించిన పారిశ్రామిక భూములను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలు వద్దు అంటూ, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించుకోవడానికి ప్రైవేట్ డెవలపర్‌లకు ధారాదత్తం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే పారిశ్రామిక భూముల బదలాయింపుపై నిజాలను తెలుసుకునేందుకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ బృందం జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక వాడల్లో ప్రకటించారు.
Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్‌లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!
హిల్డ్ పాలసీ పేరుతో రేవంత్ ప్రభుత్వం “దందా” చేస్తోందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కేవలం జీడిమెట్లలోనే కాకుండా, హరీశ్ రావు నాయకత్వంలో మరో బృందం పాశమైలారంలో, ఇతర ఎమ్మెల్యేల బృందాలు మిగిలిన పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులతో నేరుగా మాట్లాడి పరిస్థితిని అంచనా వేశాయి. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నివాస, వాణిజ్య నిర్మాణాలు చేపడితే, ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే హౌసింగ్ బోర్డు భూములను కూడా అమ్ముకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్ నగరంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, పాఠశాలలు, దవాఖానలు, చివరికి స్మశానాలకు స్థలం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ, మరోవైపు 9,300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా ఇస్తామంటుందని ఆయన మండిపడ్డారు.
ఈ 9,300 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ఆ స్థలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూళ్లు, హాస్పిటళ్లు కట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ మరియు దాని వెనుక ఉన్న అసలు నిజాలపై పూర్తిస్థాయిలో నిజనిర్ధారణ జరగాలనే ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేపట్టినట్లు బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. ఈ భూముల బదలాయింపు కుంభకోణం అంశాన్ని తాము ఇక్కడితో వదిలిపెట్టబోమని, త్వరలో దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.