Hydraa : హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు సీరియస్
Hydraa : సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చినా, ఆదేశాలను పాటించకుండా అక్రమంగా కూల్చివేతలు చేపట్టడం
- By Sudheer Published Date - 07:38 PM, Tue - 18 February 25

హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు, ప్రభుత్వ భూములు, కుంటల పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Govt) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) ఇప్పుడు అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజలు తమ భూముల విషయంలో హైడ్రాకు ఫిర్యాదులు సమర్పిస్తూ, న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. హైడ్రా కమిషన్ అధికారి ఏవీ రంగనాథ్ నేతృత్వంలో ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే, ఈ కూల్చివేతల పద్ధతి, నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చినా, ఆదేశాలను పాటించకుండా అక్రమంగా కూల్చివేతలు చేపట్టడం హైకోర్టు ధర్మాసనాన్ని కోపానికి గురిచేసింది.
8th Pay Commission: 8వ వేతన సంఘం.. ఎంత జీతం పెరుగుతుంది?
తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో ప్రవీణ్ అనే వ్యక్తికి చెందిన షెడ్‌ను హైడ్రా అధికారులు ఆదివారం నాడు కూల్చివేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు లేనప్పటికీ, తనకు ఎలాంటి సమాచారం లేకుండానే కూల్చివేశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంపై హైకోర్టు విచారణ చేపట్టి, హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌పై జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన నిబంధనలు ఎందుకు పాటించలేదని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. హైకోర్టు సూచనలు పాటించకుండా, సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలు నిర్వహించడం హైడ్రా తీరుపై మరింత విమర్శలు రాబట్టింది.
ఇటు నగర పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల కొనుగోలుదారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచనలు చేశారు. ఫామ్ ప్లాట్ల పేరుతో అనుమతిలేని లేఔట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొక తప్పదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని లక్ష్మీగూడ గ్రామంలో సర్వే నం. 50లో 1.02 ఎకరాల్లో అనుమతులు లేకుండా ప్లాట్లు అమ్ముతున్నారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ప్రకటించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ లేఔట్ల విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.