Rains : తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Rains : ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు గురువారం రెడ్ అలర్ట్ జారీ చేయగా, అక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని సూచించారు
- By Sudheer Published Date - 11:41 AM, Thu - 28 August 25

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు గురువారం రెడ్ అలర్ట్ జారీ చేయగా, అక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని సూచించారు. దీనితో సంబంధిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమై ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు.
Heavy Rain : కామారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తిన వాన
ఇక జగిత్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని హెచ్చరికలు వెలువడ్డాయి.
ఇప్పటికే రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలు నీట మునిగాయి. నిర్మల్ రూరల్‌లో 275.8 మిల్లీమీటర్లు, లక్ష్మణచాందలో నాలుగు గంటల్లోనే 238.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను చాటుతోంది. కామారెడ్డి-నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ వరద నీటితో కొట్టుకుపోయింది. వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగిప్రవహిస్తుండటంతో రోడ్లు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. జలాశయాల్లోకి వరద నీరు చేరడంతో పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల ద్వారా నేరుగా పరిస్థితులను పర్యవేక్షిస్తోంది.