Harish Rao: రుణమాఫీ చేసి, మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్!
సీఎం రైతుల పక్షపాతి అని చెప్పేందుకు వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనమని మంత్రి హరీశ్ రావు అన్నారు.
- By Balu J Published Date - 11:07 AM, Tue - 15 August 23

Harish Rao: రూ. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ కు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రైతు సంక్షేమం విషయంలో సీఎం గారు ఏనాడూ రాజీ పడలేదని ఆయన అన్నారు. ఒకే రోజు మొత్తం 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేసి అత్యధికంగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేసిన రికార్డును తెలంగాణ నెలకొల్పిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, లైన్ లో నిలుచునే అవస్థ లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రూపాయి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమవుతోందని హరీశ్ రావు అన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిరాటంకంగా కొనసాగించారని పేర్కొన్నారు. ఇప్పుడు అదే రీతిగా రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారని, సీఎం రైతుల పక్షపాతి అని చెప్పేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనమని మంత్రి హరీశ్ రావు అన్నారు.