Ukraine Live: బంకర్లలో బిక్కు బిక్కుమంటూ..!
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ కంట్రీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అయితే గత నాలుగు రోజులుగా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో అక్కడే చిక్కుకుపోయిన
- By Balu J Published Date - 03:51 PM, Mon - 28 February 22

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ కంట్రీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అయితే గత నాలుగు రోజులుగా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో అక్కడే చిక్కుకుపోయిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తినడానికి తిండి లేక.. బ్యాంకుల్లో డబ్బులున్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని కొత్తపేట తేజస్వినీ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. యుద్ధం కారణంగా ఆ దేశంలో చిక్కుకుపోయింది. తాను పడుతున్న ఇబ్బందులు గురించి తన తండ్రి వేణుకు వివరించారు. ఈ సందర్భంగా తన బిడ్డ వేదనను మీడియాకు వెల్లడించారు తండ్రి వేణు.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
మా పాప ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లింది. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం ఉంటుందని తెలిసినా అక్కడి యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కర్ఫ్యూ కారణంగా సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది. బంకర్లలో ఉంచడంతో బ్రితీంగ్ ఇష్యూ కూడా వేధిస్తుంది. పిల్లలు నిత్యం ఇబ్బందులు పడటంతో మా లాంటి తల్లిదండ్రులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులున్నాయి. కొన్ని ఎయిర్ పోర్ట్ ల్లో బాంబ్ బ్లాస్ట్ కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోజురోజుకూ యుద్ధం తగ్గిపోతుందని భావించాం.. కానీ తీవ్రత పెరుగుతూ వస్తోంది. అందుకే పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన తీసుకురావాలి. పిల్లలు రోడ్డుమార్గం ద్వారా వెళ్లాలనుకున్నా.. అవన్నీ దెబ్బతిన్నాయి. యుద్ధం కారణంగా సమీప దేశాలకు కూడా వెళ్లలేని పరిస్థితి. మెడిసిన్ చదువాలంటే మన దేశంలో చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే మా బిడ్డను ఉక్రెయిన్ ను పంపించాం. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నాలాంటి ఎవ్వరూ ఊహించలేదు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ నేతలకు ట్విట్ చేశా. వాళ్లంతా సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన పిల్లలను తీసుకువస్తే చాలా సంతోషిస్తాం.