Hyderabad : గణేశ్ నిమజ్జన ఉత్సవాలు.. ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు
ఈ నిర్ణయం వల్ల నిమజ్జనానికి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగే అవకాశం ఉంది. వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ, గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన చెరువులన్నిటినీ పరిశీలించినట్లు చెప్పారు.
- By Latha Suma Published Date - 02:46 PM, Fri - 5 September 25

Hyderabad : గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్తను తెలిపింది. సెప్టెంబర్ 6 (శనివారం) నిమజ్జనానికి అనుకూలంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల నిమజ్జనానికి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగే అవకాశం ఉంది. వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ, గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన చెరువులన్నిటినీ పరిశీలించినట్లు చెప్పారు. నిమజ్జనానికి ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వంటి ప్రాంతాల్లో మొత్తం 40 క్రేన్లు ఏర్పాటు చేశాం అని తెలిపారు.
వాహనాలపై విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉన్నపుడు, మౌంటింగ్ ప్రత్యేకంగా ఉంటే, పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతానికీ రూట్ మ్యాప్లు సిద్ధం చేసి, ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉన్న చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనాన్ని శనివారం మధ్యాహ్నం 1 గంట లోపు పూర్తి చేస్తామని వెల్లడించారు. మండపాల నిర్వాహకులు ముందుగానే బయలుదేరాలని సూచించారు. నగరమంతటా సుమారు 29 వేల మంది పోలీసులు బందోబస్తు కోసం మోహరించనున్నారని చెప్పారు. శనివారం ఒక్క రోజే 50,000కు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనున్నట్లు వెల్లడించారు.
40 లక్షల మంది భక్తులు పాల్గొంటారు: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి
ఇక, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ..నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. నగరంలో 34 ప్రధాన చెరువులు, 64 ప్రాంతాల్లో ప్రత్యేక నిమజ్జన కేంద్రాలు సిద్ధం చేశామని వివరించారు. ఈ ఉత్సవాల్లో సుమారు 40 లక్షల మంది భక్తులు పాల్గొంటారని, వీరి సౌకర్యార్థం అన్న ప్రసాదాల పంపిణీ, తాగునీటి వసతి, మెడికల్ క్యాంపులు వంటి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడడం కోసం పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు శాంతియుతంగా ఉత్సవాల్లో పాల్గొనాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలతో సహకరించాలని వారు కోరారు. హైదరాబాద్ నగరం ఈ శనివారం గణేశ్ నిమజ్జన శోభాయాత్రలతో గలగలలాడనుంది. పోలీసు, మునిసిపల్, ట్రాన్స్‌పోర్ట్ శాఖలు సమన్వయంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, మెట్రో సేవలను పొడిగించడం వంటి చర్యలు భక్తులకు విశేష ఊరటనిస్తాయని అంచనా.
Read Also: Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!