Ganesh Chaturthi : 73 కిలోల లడ్డూ నుంచి లాల్‌బాగ్‌చా రాజా వరకూ.. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు..!
Ganesh Chaturthi : బుధవారం దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణపతి జన్మదినం సందర్భంగా భక్తులు విస్తృతంగా పాల్గొని శ్రీ వినాయకుడి అనుగ్రహం కోరుకున్నారు.
- Author : Kavya Krishna
Date : 27-08-2025 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
Ganesh Chaturthi : దేశవ్యాప్తంగా బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణపతి జన్మదినం సందర్భంగా భక్తులు విస్తృతంగా పాల్గొని శ్రీ వినాయకుడి అనుగ్రహం కోరుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈసారి 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ప్రతిష్టించారు. గణపయ్య ఇరువైపులా జగన్నాథుడు, సుభద్ర, బలరాములు, లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి, గజ్జెలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక గణపతి దేవాలయం వద్ద తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు తరలి వచ్చారు. “గణపతి బప్పా మోరియా” నినాదాలతో ఆలయం మార్మోగింది. విపరీతమైన రద్దీ మధ్య భక్తులు గణనాథుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. అదే సమయంలో లాల్‌బాగ్‌చా రాజా వద్ద ఆరాధన వాతావరణం మరింత భక్తిమయంగా కనిపించింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వినాయకుడి దర్శనం కోసం తహతహలాడారు. ఓ భక్తుడు మాట్లాడుతూ, “ఇక్కడికి రాగానే స్వర్గంలోకి వచ్చినట్టుంది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేం” అని తెలిపాడు. మరో భక్తుడు “ప్రతి ఏడాది వస్తాను. ఉదయం నుంచే క్యూలో నిలబడి ఉన్నా, గణేశుడి దర్శనం పొందడమే గొప్ప అదృష్టం” అని అన్నాడు.
Telangana Cabinet : క్యాబినెట్ భేటీ 30కి వాయిదా
రాజస్థాన్‌లోని జైపూర్ లో మోతి దుంగరి గణేశ్‌జీ దేవాలయం వద్ద కూడా భక్తుల సముద్రమే కదలాడింది. తెల్లవారుజాము నుంచే జనసందోహం ఆలయాన్ని నింపేసింది. భక్తులు కుటుంబాలతో కలిసి గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ నియంత్రణ కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదనపు సీపీ రమేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, “14 మంది అదనపు డీసీపీలతో పాటు 800 మంది సిబ్బందిని మూడు షిఫ్టుల్లో విధుల్లో పెట్టాం. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం” అని తెలిపారు. ఆలయ ప్రాంగణం వద్ద బారికేడ్లు, చెక్‌పాయింట్లను ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలు సజావుగా సాగేలా చూసారు.
తమిళనాడు లో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా 73 కిలోల లడ్డూ సిద్ధం చేశారు. స్థానిక మిఠాయి దుకాణంలో ఉంచిన ఈ లడ్డూని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈసారి వినాయక చవితి వేడుకలు దేశమంతా భక్తి, సంప్రదాయం, సామూహిక ఉత్సాహానికి ప్రతీకగా నిలిచాయి. కోట్లాది మంది ప్రజలు ఒకే తాటిపైకి వచ్చి విఘ్నేశ్వరుడి అనుగ్రహం కోసం ప్రార్థించారు.
US High Tariffs: భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకం.. ఎంత నష్టమంటే?