Electricity Charges : తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. డిస్కంల ప్రతిపాదనలివీ
ప్రతినెలా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటును వాడే వినియోగదారులకు నెలవారీ ఫిక్స్‌డ్ ఛార్జీని రూ.10 నుంచి రూ.50కి పెంచాలని డిస్కంలు(Electricity Charges) ప్రపోజ్ చేశాయి.
- Author : Pasha
Date : 26-10-2024 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
Electricity Charges : త్వరలోనే తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కరెంటు ఛార్జీలు ఎంతమేర ఉన్నాయనే వివరాలతో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్‌సీ)కు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇటీవలే ఒక నివేదికను సమర్పించాయి. ఇందులో విద్యుత్ ఛార్జీల పెంపుపై పలు కీలక ప్రతిపాదనలను డిస్కంలు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై ఈఆర్‌సీ పాలకవర్గం చర్చించి, ఛార్జీల పెంపుపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
Also Read :Jio Hotstar : ‘జియో హాట్‌స్టార్’ డొమైన్ వ్యవహారం.. తెరపైకి ఇద్దరు పిల్లలు
ఈఆర్‌సీకి డిస్కంల ప్రతిపాదనలివీ..
- ప్రతినెలా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటును వాడే వినియోగదారులకు నెలవారీ ఫిక్స్‌డ్ ఛార్జీని రూ.10 నుంచి రూ.50కి పెంచాలని డిస్కంలు(Electricity Charges) ప్రపోజ్ చేశాయి.
- ప్రతినెలా 300 యూనిట్లకుపైగా కరెంటును వినియోగిస్తున్న వారికి నెలవారీ ఫిక్స్‌డ్ ఛార్జీగా అత్యధికంగా మహారాష్ట్రలో రూ.148, కర్ణాటకలో రూ.120 వసూలు చేస్తున్నారు. అయితే ఏపీ, తెలంగాణలో నెలవారీ ఫిక్స్‌డ్ ఛార్జీ ఇప్పటికీ కేవలం 10 రూపాయలు. నెలవారీ ఫిక్స్‌డ్ ఛార్జీ ఉత్తర ప్రదేశ్‌లో రూ.53, గుజరాత్‌లో రూ.45 ఉంది.
- ప్రతినెలా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటును వాడే వినియోగదారులకు ఫిక్స్‌డ్ ఛార్జీలను పెంచితే అదనంగా రూ.328 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు ఈఆర్‌సీకి తెలిపాయి.
- లోటెన్షన్ వాణిజ్య కేటగిరీ కనెక్షన్లకు తెలంగాణలో ప్రతినెలా ఫిక్స్‌డ్ ఛార్జీగా రూ.70 వసూలు చేస్తున్నారు. అయితే దీన్ని రూ.150కి పెంచాలని డిస్కంలు ప్రపోజ్ చేశాయి. ఈ ఛార్జీ అత్యధికంగా మహారాష్ట్రలో రూ.626, యూపీలో రూ.355, కర్ణాటకలో రూ.255 మేర ఉంది. తమిళనాడులో ఈ ఛార్జీ రూ.107గా ఉంది.
- 11కేవీ కనెక్షన్ స్థాయిలోనే.. 33కేవీ, 132 కేవీ కనెక్షన్లకు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచి వసూలు చేస్తామని డిస్కంలు తెలిపాయి.
Also Read :Indian Immigrants : ఆ భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
- ప్రస్తుతం తెలంగాణలో హెచ్‌టీ పరిశ్రమల కనెక్షన్లకు 11కేవీకి యూనిట్‌కు రూ.7.65, 33కేవీకి రూ.7.15, 132కేవీకి రూ.6.65 చొప్పున డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇకపై ఈ అన్ని కేటగిరీలకు ఒకేవిధంగా యూనిట్‌కు రూ.7.65 చొప్పున ఛార్జీని విధిస్తామని తెలిపాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ ఛార్జీ ప్రతి యూనిట్‌కు రూ.8.36, కర్ణాటకలో రూ.7.40, గుజరాత్‌లో రూ.6.90, తమిళనాడులో రూ.6.90 చొప్పున ఉందని డిస్కంలు వెల్లడించాయి.
- హెచ్‌టీ వాణిజ్య కనెక్షన్‌కు మన రాష్ట్రంలోప్రతి యూనిట్‌కు రూ.8.80 తీసుకుంటున్నారు. ఈ ఛార్జీ అత్యధికంగా మహారాష్ట్రలో రూ.13.21, కర్ణాటకలో రూ.9.25 మేర వసూలు చేస్తున్నారు. తమిళనాడులో మాత్రం రూ.8.70 మాత్రమే తీసుకుంటున్నారు.
- హెచ్‌టీ వాణిజ్య కేటగిరీలో నెలవారీ ఫిక్స్‌డ్ ఛార్జీని రూ.475 నుంచి రూ.500కి పెంచాలని డిస్కంలు ప్రపోజ్ చేశాయి. ఈ ఛార్జీలు అత్యధికంగా మహారాష్ట్రలో రూ.664, తమిళనాడులో రూ.590, గుజరాత్‌లో రూ.570 వసూలు చేస్తున్నారు.
- హెచ్‌టీ ఛార్జీల పెంపునకు తెలంగాణ ఈఆర్‌సీ ఆమోదం తెలిపితే.. రూ.700 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా.