Liquor Scam : `జయభేరి`లో రాబిన్ డిస్టలరీ గుట్టు
హైదరాబాద్ లోని రాబిన్ డిస్టలరీ ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథంతా అల్లుకుంది.
- By CS Rao Published Date - 01:29 PM, Fri - 16 September 22

హైదరాబాద్ లోని రాబిన్ డిస్టలరీ ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథంతా అల్లుకుంది. కేవలం లక్ష రూపాయాల మూలధనంతో నాలుగు నెలల క్రితం ఏర్పడిన ఈ కంపెనీ యాజమాన్యం కోట్లాది రూపాయల్ని ఎలా చేతులు మార్చారా? అనే పెద్ద ప్రశ్న. డైరెక్టర్లుగా ఉన్న ప్రేంసాగర్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై ఉన్నారు. ఒకరు ఇండియా మరొకరు కెనడియన్ గా వెబ్ సైట్లో పొందుపరిచారు. వాళ్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని పాత్రధారులుగా ఈడీ అనుమానిస్తోంది. సూత్రధారులుగా అభిషేక్ రావు, సృజన్ రెడ్డి ఉన్నారని ప్రాథమికంగా బయటకు వస్తోంది. వీళ్ల వెనుక తెలంగాణ పెద్దకు చెందిన కుటుంబం ఉందని బీజేపీ చెబుతోంది.
రాబిన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ 22 ఏప్రిల్ 2022న స్థాపింంచారు. దీని రిజిస్టర్డ్ కార్యాలయం తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఉంది. కంపెనీ ఇప్పటికే పనిచేస్తున్నట్టు ఉంది. రూ. 1.00 లక్షల అధీకృత మూలధనం మరియు రూ. 1.00 లక్షల చెల్లింపు మూలధనం కలిగిన షేర్లకు పరిమితమైన కంపెనీగా నమోదు అయింది. ప్రస్తుతం ప్రేంసాగర్ గండ్రా , అరుణ్ రామచంద్రన్ పిళ్లై ప్రస్తుతం డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ కంపెనీ లావాదేవీల నివేదికకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చేతులు మారిన కోట్లాది రూపాయాలకు ఏ మాత్రం పొంతనలేకుండా ఉంది. దాన్ని నిగ్గు తేల్చడానికి శుక్రవారం మరోసారి ఈడీ రంగంలోకి దిగింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లల్లో ఏకకాలంలో ఈడీ ఈ దాడులకు దిగారు. హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో గల రాబిన్ డిస్టిల్లరీ అండ్ బ్రేవరెజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈడీ అధికారులు సోదాలను నిర్వహిస్తోన్నారు. డాక్యుమెంట్లను పరిశీలిస్తోన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గంలో గల జయభేరి అపార్ట్‌మెంట్స్‌లో కూడా ఈడీ అధికారులు దాడులు సాగిస్తోన్నారు. రామచంద్రన్ పిళ్లైకి చెందిన కంపెనీలు, నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాబిన్ డిస్టిల్లరీ అండ్ బ్రేవరెజెస్ ప్రైవేట్ లిమిటెడ్ రామచంద్రన్ పిళ్లైకి చెందినదే. కాగా- అభిషేక్ రావు, జీ ప్రేమ్ సాగర్ నివాసాలపైనా దాడులు సాగుతున్నాయి. ఏపీలోని నెల్లూరులో ఆరు చోట్ల సోదాలను నిర్వహిస్తోన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో ఢిల్లీలో విస్తృతంగా దాడులు నిర్వహించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడంలో భాగంగా ఇవ్వాళ ఏకకాలంలో 45 ప్రాంతాల్లో దాడులకు దిగింది. ఇదివరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏ1గా ఆయన పేరును చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 120-బీ, 477-ఏ కింద కేసు నమోదు చేశారు. మద్యం వ్యాపారులకు రూ.30 కోట్ల మినహాయింపు ఇచ్చారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్నారు. రాబిన్ డిస్టలరీ రహస్యాలు బయటకు వస్తే ఢిల్లీ స్కామ్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు బయటపడే అవకాశం ఉంది.