Dussehra Holidays: దసరా సెలవులు ప్రారంభం: బడులు మూత, సందడిలో విద్యార్థులు
దీంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసి, సెలవులను సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభించారు.
- By Dinesh Akula Published Date - 10:25 AM, Sun - 21 September 25

హైదరాబాద్, సెప్టెంబర్ 21: Dussehra Holidays- తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 20 శనివారం నుంచి ఈ సెలవులు అధికారికంగా ప్రారంభమయ్యాయని పాఠశాలలు ప్రకటించాయి. దీంతో విద్యార్థులు ఆనందంగా ఇంటి బాట పట్టారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు తమ గ్రామాలకు వెళ్లేందుకు శనివారం నుంచే ప్రయాణం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు పిల్లలను తీసుకెళ్లేందుకు రావడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు విద్యార్థులతో నిండిపోయాయి. ప్రయాణికుల రద్దీతో రోడ్లపై కూడా ట్రాఫిక్ పెరిగింది. బస్సులు వచ్చిన వెంటనే నిండిపోతుండటంతో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల సెలవులు ఇవ్వాలని మొదట నిర్ణయించినా, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాటిని ముందుకు తెచ్చారు. దీంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసి, సెలవులను సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు కొనసాగనున్నాయి. ఇక క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటించబడ్డాయి.
రెండు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు తిరిగి అక్టోబర్ 3న మళ్లీ తెరుచుకోనున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో విద్యార్థుల్లో, వారి కుటుంబాల్లో ఉత్సాహం కనిపిస్తోంది.