Hyd : యూనివర్సిటీలో డ్రగ్స్ దందా..ఒక్కో సిగరెట్ రూ.2500 అమ్మకం
Hyd : ఈ ఆపరేషన్ మల్నాడు రెస్టారెంట్ ఓనర్ ఇచ్చిన సమాచారంతో జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీమారుతి కొరియర్స్ ద్వారా ఈ డ్రగ్స్ హైదరాబాద్‌కి చేరాయని ఈగల్ టీమ్ గుర్తించింది. గతంలో ఈ ముఠా నైజీరియన్ నిక్ అనే వ్యక్తి నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి పబ్బుల్లో పార్టీలు చేసుకున్నట్లు కూడా తేలింది
- By Sudheer Published Date - 07:15 PM, Tue - 26 August 25

తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ నగరంలో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా, ఈ బృందం జరిపిన తనిఖీలలో హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ(Mahindra University Drugs)లో పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠా పట్టుబడింది. బాచుపల్లిలోని ఈ యూనివర్సిటీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. పట్టుబడ్డవారి నుంచి 1.15 కిలోల గంజాయి, 45 గ్రాముల ఓజీ వీడ్ తో పాటు డిజిటల్ తూకం మెషిన్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Heavy rains : తెలంగాణకు హెచ్చరిక… నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ ముఠాలో మహ్మద్ అషార్ జావీద్ ఖాన్, నోవెల్ల టాంగ్ బ్రామ్, అంబటి గణేష్, శివకుమార్ అనే నలుగురు విద్యార్థులు ఉన్నారు. వీరి ఫోన్లను పరిశీలించగా సుమారు 50 మంది విద్యార్థులు వీరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. యూనివర్సిటీ హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈగల్ టీమ్ గట్టి నిఘా పెట్టింది. ఈ ముఠా ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా గంజాయిని తెప్పించుకుని ఒక్కో సిగరెట్‌ను రూ. 2500కు అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు. ఈ డ్రగ్స్ బిజినెస్‌లో ఢిల్లీకి చెందిన అరవింద్ శర్మ, అనిల్ అనే వ్యక్తులతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా మణిపూర్‌కు చెందిన విద్యార్థి నోవెల్ల టాంగ్ బ్రూమ్ కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఆపరేషన్ మల్నాడు రెస్టారెంట్ ఓనర్ ఇచ్చిన సమాచారంతో జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీమారుతి కొరియర్స్ ద్వారా ఈ డ్రగ్స్ హైదరాబాద్‌కి చేరాయని ఈగల్ టీమ్ గుర్తించింది. గతంలో ఈ ముఠా నైజీరియన్ నిక్ అనే వ్యక్తి నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి పబ్బుల్లో పార్టీలు చేసుకున్నట్లు కూడా తేలింది. డ్రగ్స్ వినియోగం, సరఫరాలో పట్టుబడిన విద్యార్థులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తగ్గవచ్చని ఆశిస్తున్నారు.