Congress Shuffule : రేవంత్ కు పొంచి ఉన్న పదవీగండం?
పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవికి గండం (Congress Shuffule) తప్పదా? ఆయన్ను మార్చేయబోతున్నారా?ప్రక్షాళన కాంగ్రెస్ లోనూ జరగనుందా?
- Author : CS Rao
Date : 17-07-2023 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవికి గండం (Congress Shuffule) తప్పదా? ఆయన్ను మార్చేయబోతున్నారా? బీజేపీలో జరిగిన ప్రక్షాళన తరహాలో కాంగ్రెస్ లోనూ జరగనుందా? అంటే ఔనంటున్నారు కాంగ్రెస్ వర్గీయులు. ఉచిత విద్యుత్ గురించి అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యల దుమారం ఆగలేదు. రోజుకో రకంగా మలుపు తిరుగుతూ చంద్రబాబు ఏజెంట్ వరకు వచ్చాయి. ఆయనకున్న బలం మీద ప్రత్యర్థులు దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా తెలుగు కాంగ్రెస్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ కు ప్రత్యర్థులు పేరు పెట్టారు. దీంతో జరుగుతోన్న నష్టాన్ని సరిచేయడానికి అధిష్టానం రంగంలోకి దిగింది.
పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవికి గండం (Congress Shuffule)
మునుపెన్నడూ లేని విధంగా 17 పార్లమెంట్ స్థానాలకు 17 మంది పరిశీలకులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఆ 17 మంది కరుడుకట్టిన కాంగ్రెస్ వాదులు కావడం గమనార్హం. అలాగే, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ ప్రచారం కమిటీ కో చైర్మన్ పదవిని కట్టబెట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద రాజకీయంగా కసితీర్చుకునే ధోరణిలో పొంగులేటి ఉండడమే ఆయనకు కలిసొచ్చింది. ఇక షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. ఆమెకు కీలక పదవిని అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ (Congress Shuffule) రేవంత్ పదవికి గండం తెచ్చేలా కనిపిస్తున్నాయి.
పదవిని తీసివేయడానికి కేసీఆర్ కుట్ర పన్నాడని ఇటీవల రేవంత్ చేసిన ప్రకటన
తన పదవిని తీసివేయడానికి కేసీఆర్ కుట్ర పన్నాడని ఇటీవల రేవంత్ చేసిన ప్రకటన గుర్తుండే ఉంటుంది. ఆ రోజు నుంచి జరుగుతోన్న పరిణామాలు ఏమోగానీ, ముందుకుగానే.(Congress Shuffule) పదవీగండాన్ని రేవంత్ పసిగట్టినట్టు కాంగ్రెస్ వర్గీయులు భావిస్తున్నారు. అంతేకాదు, ఆయన మీద పలువురు స్వపక్షంలోని వాళ్లే అధిష్టానంకు ఫిర్యాదు చేయడం జరిగింది. పార్టీకి నష్టం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. అధికార పార్టీలోని వాళ్లను విధానపరమైన లోపాలతో కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని ఆరోపించే వాళ్లు అనేకులు. ఇటీవల ఆయన చేసిన కామెంట్లను జోడిస్తున్నారు. వనసమారాధన సందర్భంగా రెడ్డి సామాజికవర్గానికి రాజ్యాధికారం ఉండాలని, ప్రతి పార్టీలోనూ నాయకత్వం ఉండాలని చెప్పడం, హోంగార్డులుగా సీనియర్లను పోల్చడం తదితరాలు పార్టీకి నష్టం చేకూర్చేలా చేసి వ్యాఖ్యలని భావిస్తున్నారు. తాజాగా ఉచిత విద్యుత్ మీద ఆయన చేసిన కామెంట్స్ నుంచి పార్టీ బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంది.
బీజేపీలో జరిగిన ప్రక్షాళన తరహాలో కాంగ్రెస్ లోనూ
తాజాగా బీజేపీలోనూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించారు. పలు సందర్భాల్లో ఆయన కూడా వివాదస్పద కామెంట్లు చేశారు. సమాజంలో మతతత్త్వాన్ని రెచ్చగొట్టేలా బండి వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని సీనియర్లు ఆయన ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టారు. సీన్ కట్ చేస్తే ఆయన్న మార్చేశారు. దానికి కారణం కేసీఆర్ అంటూ కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న ఫిక్సింగ్ రాజకీయానికి బండి మార్పు ఒక సంకేతంగా కాంగ్రెస్ వివరిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. పైగా పీసీసీ చీఫ్ హోదాలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోని కొందరు కోవర్టులతో కలిసి పదవి నుంచి తొలగించడానికి (Congress Shuffule) కేసీఆర్ కుట్ర పన్నారని చెప్పడం గమనార్హం.
Also Read : T Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై క్లారిటీతో ఉన్న హైకమాండ్
యాదృశ్చికమా? వ్యూహాత్మకమా? తెలియదుగానీ, ఉచిత విద్యుత్ వార్ జరుగుతోన్న సమయంలో బషీర్ బాగ్ కాల్పులను రేవంత్ రెడ్డి బయటకు తీశారు. ఆ రోజు తుపాకీ తూటాలకు ముగ్గురు బలి కావడానికి కేసీఆర్ అంటూ రేవంత్ స్లోగన్ అందుకున్నారు. ఇంకేముంది, చంద్రబాబు ఏజెంట్ అంటూ రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఈ పరిణామం రేవంత్ రెడ్డికి నష్టం కలిగించేలా కనిపిస్తోంది. ఎందుకంటే, ఆయన బలం టీడీపీ క్యాడర్. పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడర్లు, క్యాడర్ మాత్రమే ఆయన వర్గంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సొంతంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు ప్రత్యేక అనుచరులు లేరు. ఇప్పుడు చంద్రబాబు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి మీద ముద్రవేస్తే ఆయన గ్లామర్ పడిపోతుందని బీఆర్ఎస్ అంచనా.
Also Read : Telangana Congress : టీకాంగ్రెస్‌లో ఆ నేతకు పెరిగిన ప్రాధాన్యత.. ఇబ్బందుల్లో టీపీసీసీ చీఫ్
తెలుగుదేశం ముద్ర పోగొట్టుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే, చంద్రబాబును సహచరునిగా చెబుతున్నారు. ఒకప్పుడు అన్నీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు తన గురువుగా చెప్పుకున్నారు. ఇప్పుడు గురువు స్థానంలో సహచరుడు అనే పదాన్ని రేవంత్ రెడ్డి వాడుతున్నారు. చంద్రబాబు నీడను తొలగించుకోవాలని చూస్తోన్న రేవంత్ మీద అదునుచూసి బీఆర్ఎస్ లీడర్లు మరింత ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే అంశంగా అధిష్టానం భావిస్తుందని తెలుస్తోంది. అందుకే, రేవంత్ రెడ్డికి పదవీగండం తప్పదని కాంగ్రెస్ వర్గీయుల్లోని ఒక గ్రూప్ బలంగా నమ్ముతోంది.