Congress Membership: కాంగ్రెస్ లో ఎన్నికల జోరు…5.6కోట్ల మందికి సభ్వత్వం..!!
ఎన్నికల్లో వరుస ఓటములు చవిచూసిన నేపథ్యంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది.
- By Hashtag U Published Date - 10:04 AM, Sun - 17 April 22

ఎన్నికల్లో వరుస ఓటములు చవిచూసిన నేపథ్యంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకుంది. నవంబర్ 1న ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏప్రిల్ 15న మగిసింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. గుజరాత్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఆశించిన విధంగా సభ్వత్వాలు నమోదు కాలేదు.
కాగా దేశవ్యాప్తంగా 5.6కోట్ల మంది కొత్తగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ సంఖ్యలో 2.6కోట్లమంది డిజిటల్ విధానంలోనూ…మరో3కోట్ల మంది ఆఫ్ లైన్ లోనూ కాంగ్రెస్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు ప్రముఖలు సభ్యత్వ నమోదు గడువు ముగుస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకోవడం విశేషం. పార్టీని కిందిస్థాయి నుంచి అన్ని విభాగాల్లో ప్రక్షాళన చేయాలని భావించి ఈ కసరత్తును ప్రారంభించారు. ఇన్నాళ్లూ పార్టీ సభ్యత్వం కార్యక్రమంగాని, ఎన్నికల తంతుగానీ, తూతూమంత్రంగాను, బోగస్ సభ్యులతో కొనసాగేదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. 137ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇంతస్థాయిలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక ప్రత్యేకంగా తయారు చేసిన కాంగ్రెస్ సభ్యత్వ యాప్ ద్వారా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నాయకులైనా, కార్యకర్తలైనా ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. డిజిటల్ విధానంలో దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు నాలుగు దశల్లో పరిశీలించనున్నారు.
కాంగ్రెస్ తో పోల్చి చూస్తే…బీజేపీ 2019-2020లో తన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. దాదాపు 18కోట్లు మంది కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారని బీజేపీ పేర్కొంది. 2019 సార్విత్రిక ఎన్నికల్లో సాధించిన 22కోట్ల ఓట్ల ఈ సంఖ్య దాదాపు 81 శాతం ఉంది.
కర్నాటక, తెలంగాణలో ఆశాజనకంగా…
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి 75లక్షల మంది కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 1.39కోట్ల ఓట్లు నమోదయ్యాయి. అంటే పార్టీ సాధించిన మొత్తం ఓట్లలో దాదాపు 55శాతం మంది ఎక్కువగా ఉన్నారు. అయితే తెలంగాణలో 55 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకున్న పార్టీ…తెలంగాణలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 58లక్షలకు పైగా ఓట్లను సాధించింది. దీన్ని బట్టి చూస్తే పార్టీ సభ్యత్వం సంఖ్య అది సాధించిన ఓట్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. వచ్చే ఏడాది కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సభ్యత్వం నమోదు అనేది చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు.
గుజరాత్, రాజస్థాన్, కేరళ,మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదనే గణాంకాలు చూపిస్తున్నాయి. గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 10 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన 1.24కోట్ల ఓట్లలో ఇది 10శాతం మాత్రమే. రాజస్థాన్ లోకొత్తగా 15లక్షల మంది సభ్యత్వం తీసుకోగా…అది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన 1.39కోట్ల ఓట్ల కంటే కేవలం 10 శాతమే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కేరళ, మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ రిక్రూట్ మెంట్ సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే సభ్వత్వ నమోదు కార్యక్రమంలో క్యాడర్ చురుకుగా పాల్గొనేలా చేయడంలో పార్టీ విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.