Revanth Reddy: కరెంట్ మంటలు.. రేవంత్ హౌస్ అరెస్ట్!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు వ్యతిరేకంగా నేడు విద్యుత్ సౌధ, పౌరసరఫరాల భవన్‌ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
- By Balu J Published Date - 11:48 AM, Thu - 7 April 22

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు వ్యతిరేకంగా నేడు విద్యుత్ సౌధ, పౌరసరఫరాల భవన్‌ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు గురువారం గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రేవంత్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, దాసోజు శ్రవణ్, వేణుగోపాల్, బక్క జడ్సన్, నగేష్ ముదిరాజ్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపు, విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై నేడు విద్యుత్ సౌద, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఉదయం 10 30 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరమ్మ విగ్రహం నుంచి ఖైరతాబాద్ వరకు ప్రదర్శనలు చేశారు. అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధనం, విద్యుత్ చార్జీలను ప్రభుత్వం తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
పన్ను నొప్పా.. పన్నుల నొప్పా: మధు యాష్కీ
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది పన్ను నొప్పి కాదు.. వచ్చింది పన్నులు నొప్పి మాత్రమే అని కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు సిగ్గులేకుండా జాతీయ రహదారులపై ధర్నాలు చేస్తూ ప్రజలను, ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలో పండుకుంటారని, ప్రధానిని కలవరని, ఇక్కడి నాయకులు మాత్రం నాయకులు ధర్నాలు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని.. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ చేయడాన్ని మధుయాష్కీ ఖండించారు.
అరెస్టులు అప్రజాస్వామికం: ఉత్తమ్
కాంగ్రెస్ నేతల అరెస్టులు అప్రజాస్వామికం, నియంత చర్య అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు సామాన్యుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరితో ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మీరు రోడ్లు దిగ్బంధం చేయొచ్చు. కానీ మేము ధర్నాలు చేయొద్దా? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. అయితే విద్యుత్ ఆందోళన కార్యక్రమాలపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పిలుపునిచ్చినప్పటికీ కొంతమంది సీనియర్లు దూరంగా ఉండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.