Telangana Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం: తెలంగాణలో 96 నేతలకు పార్టీలో ముఖ్య పదవులు అప్పగింపు
ఈ జాబితాలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం గమనార్హం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ముస్లింలకు పెద్ద సంఖ్యలో పదవులు ఇచ్చారు.
- By Hashtag U Published Date - 08:32 AM, Tue - 10 June 25

హైదరాబాద్: (Telangana Congress) తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంచలనాత్మక రాజకీయ కదలిక చేసింది. గత కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న పార్టీ జాబితాలపై తాజాగా అధిష్ఠానం స్పష్టతనిచ్చింది. ఈ క్రమంలో టీపీసీసీ కమిటీకి 96 మంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కొత్త జాబితాను విడుదల చేసింది. ఇందులో 27 మందికి ఉపాధ్యక్ష పదవులు, 69 మందికి ప్రధాన కార్యదర్శుల పదవులు కేటాయించబడ్డాయి.
ఈ జాబితాలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం గమనార్హం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ముస్లింలకు పెద్ద సంఖ్యలో పదవులు ఇచ్చారు. మహిళలకు కూడా గణనీయమైన ప్రాధాన్యత లభించింది. ఇది పార్టీలో సమతుల్యతకు, ప్రాంతీయ సామరస్యతకు దోహదపడేలా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇకపోతే, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. పార్టీలో తీసుకున్న తాజా నిర్ణయాలపై, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్ఠానంతో చర్చలు జరిపారు. ఇప్పటికే తాను కలసిన కేసీ వేణుగోపాల్‌తో పాటు, ఇవాళ ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. శాఖలపై నిర్ణయం తీసుకోవడంలో రాజకీయ సమీకరణలు, అసంతృప్తుల నచ్చవేత, భవిష్యత్ కార్యాచరణ అన్నీ ఇందులో భాగమవుతున్నాయి.
ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న హోం, మున్సిపల్, ఎడ్యుకేషన్, మైనింగ్, మైనార్టీ వెల్ఫేర్ వంటి ముఖ్యమైన శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.
గడ్డం వివేక్‌కు లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలు, వాకిటి శ్రీహరికి లా, యూత్, పశుసంవర్థక లేదా మత్స్యశాఖ, అద్లూరి లక్ష్మణ్‌కి ఎస్సీ-ఎస్టీ వెల్ఫేర్ శాఖలు కేటాయించవచ్చన్న ప్రచారం ఊపందుకుంది.
ఇక అసంతృప్తుల జాబితాను సైతం సీఎం రేవంత్ అధిష్ఠానానికి అందించినట్టు సమాచారం. వారు తిరిగి పార్టీకి ఎలా నమ్మకంగా ఉండేలా చేయాలో కూడా చర్చలు జరిగాయి.
అంతేకాదు, రాబోయే కార్పొరేషన్‌లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీరియస్‌గా ఫోకస్ పెట్టాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌లో లొల్లి, బీజేపీతో ఉన్న రాజకీయ ఒప్పందాలను ఎండగట్టే దిశగా పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ తాజా రాజకీయం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పునఃసంఘటన దశలోకి అడుగుపెట్టినట్టు స్పష్టమవుతోంది. 2024 తర్వాత పార్టీ వ్యూహాల్లో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.
Hon’ble Congress President has approved the proposal for the appointment of Vice
Presidents and General Secretaries of the Telangana Pradesh Congress Committee,
as enclosed, with immediate effect. pic.twitter.com/0F8CRtZmhu— Telangana Congress (@INCTelangana) June 9, 2025