Leak : తెలంగాణ ప్రభుత్వంలో లీకు వీరులు ఎక్కువయ్యరా..? కీలక విషయాలు బయటకు వెళ్తున్నాయా..?
Leak : ముఖ్యంగా సచివాలయంలో జరిగిన చర్చలు, కీలక నిర్ణయాలు మీడియా ద్వారా బహిర్గతమవుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందినట్టు కనిపిస్తోంది
- By Sudheer Published Date - 12:28 PM, Thu - 17 April 25

రేవంత్ సర్కార్ (Congress Govt) కు లీక్ రాయుళ్ల (Leaks) బెడద ఎక్కువైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఎంత గుట్టుగా నిర్ణయాలు తీసుకున్నా, చర్చలు నిర్వహించినా, అవి నిమిషాల వ్యవధిలోనే ప్రతిపక్షాల చెవుల్లోకి చేరిపోతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా సచివాలయంలో జరిగిన చర్చలు, కీలక నిర్ణయాలు మీడియా ద్వారా బహిర్గతమవుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందినట్టు కనిపిస్తోంది. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించినా, చర్యలు తీసుకున్నట్టు కనబడడంలేదు.
ఇటీవల కొన్ని ముఖ్యమైన పదవుల భర్తీకి సంబంధించి జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశం పూర్తి గోప్యతతో నిర్వహించిన విషయం దీనికి ఉదాహరణ. కానీ అదే తరహా సమావేశాలపై ముందుగానే లీకులుగా సమాచారం బయటకు వెళ్లడమే కాకుండా, మంత్రివర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలూ అక్షర తేడా లేకుండా బయటికి రావడం గమనార్హం. అధికారులే సమాచారం లీక్ చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న పౌర సంబంధాల అధికారి ఒకరు ప్రతిపక్ష మీడియా ప్రతినిధులతో అనుచితంగా మెలుగుతూ కీలక సమాచారం వెల్లడిస్తున్నారని సమాచారం.
Rohit Sharma: రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు.. కోచ్, సెలెక్టర్‌కు ముందే తెలుసు!
ఇదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన వ్యక్తులు కొత్త సర్కార్‌లో కొనసాగుతూ, వారి అనుభవం, పరిచయాలను ఉపయోగించుకుని తమ హవా చూపిస్తున్నారు. ప్రాంతం, కులం, పాత పరిచయాలను అడ్డుపెట్టుకుని మంత్రుల వద్దకు చేరిన ఈ అధికారులు ప్రభుత్వ వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించిన విషయాలే ప్రతిపక్షాల చేతిలోకి వెళ్లిన ఉదంతం, అంతర్గత వ్యవస్థలో ఉన్న భేదాలను బహిరంగం చేస్తోంది. ఇంటెలిజెన్స్ నివేదికలు అందినా, ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం పలు పరిణామాలకు దారి తీసింది.
ఇక ముఖ్యమంత్రి కోటరీలో ఉన్నవారు కూడా సమచార లీక్‌లలో పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలు, జీవోలు, ప్రైవేట్ సమావేశాల్లో చర్చించిన విషయాలు బహిరంగంగా మారడంతో సీఎం కార్యాలయం గోప్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పౌర సంబంధాల అధికారులు, మీడియా ప్రతినిధుల కలయిక ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే, పరిపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరింత దృష్టి సారించి లీక్ రాయుళ్లను కంట్రోల్ చేస్తుందో చూడాలి.
Telangana Govt Jobs: ఉద్యోగాల జాతర.. 18,236 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్లు