Congress Holds Dharna : రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్..దద్దరిల్లిన ఢిల్లీ
Congress Holds Dharna : కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే రిజర్వేషన్ బిల్లులను ఆమోదించకపోతే, దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు వెనకాడబోమని రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు
- By Sudheer Published Date - 03:24 PM, Wed - 6 August 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), బుధువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాస్) ధర్నా(Dharna in Delhi)లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. కులగణన మరియు బీసీ రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరే విధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశానికి ఆదర్శమని, బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలన్న తమ లక్ష్యాన్ని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో యాత్ర’లో కులగణన అవసరం ఉందన్న డిమాండ్ బలంగా వచ్చిందని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (42% BC Reservation) కల్పించే బిల్లును ఆమోదించామని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే, ఈ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉందని, తక్షణమే దీనిని ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతిని కలవడానికి అపాయింట్‌మెంట్ కోరినా, ఇప్పటివరకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు.
Bananas : రోజూ ఎన్ని అరటిపండ్లు తినాలి?.. ఎప్పుడు తినాలి? శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి?
బీసీల కోసం తమ పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30 లోపల పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేస్తూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోతే ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే బీసీల హక్కులను అడ్డుకుంటోందని అనుమానం వ్యక్తం చేస్తూ, తాము పంపిన బిల్లులను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
చివరగా కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే రిజర్వేషన్ బిల్లులను ఆమోదించకపోతే, దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు వెనకాడబోమని రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. బీసీల మనోభావాలను దుర్లక్ష్యం చేస్తే, కాంగ్రెస్ పార్టీ దీనిని ఒక దేశవ్యాప్త రాజకీయ పోరాటంగా మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పవర్ ఫుల్ స్పీచ్ ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.