Old City : ఓల్డ్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
Old City : హైదరాబాద్ అంటే ముందు గుర్తొచ్చేది ఓల్డ్ సిటీ అని, ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని ఆయన పేర్కొన్నారు
- Author : Sudheer
Date : 06-01-2025 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ (Old City) అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పూర్తి కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ అంటే ముందు గుర్తొచ్చేది ఓల్డ్ సిటీ అని, ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ (Aranghar-Zoopark Flyover)ను ప్రారంభించిన సందర్భంగా, ఈ ప్రాంతం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ఫ్లైఓవర్‌కు దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (PM Modi) పేరు పెట్టినట్టు తెలిపారు.
ఓల్డ్ సిటీ మెరుగుదలకు మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుద్ధరణ, శాంతి భద్రతల పరిరక్షణ వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చిన్నపాటి వర్షానికి వరదలు, ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయనీ, దీనికి శాశ్వత పరిష్కారం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకురావాలని, నీటి సమస్యల పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీతో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చర్చలు జరిపిన విషయాన్ని సీఎం వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైలు నిర్మాణం కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇవి పూర్తి అయితే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఓల్డ్ సిటీ అభివృద్ధిలో ఎంఐఎంతో కలిసి పనిచేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మీర్ ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి, ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణం వంటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తామని తెలిపారు. ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మాణం వంటి ప్రాజెక్టులను కూడా మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఓల్డ్ సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
Read Also : Motorcycle Sized Tuna : రూ.11 కోట్లు పలికిన ట్యూనా చేప.. బైక్ రేంజులో సైజు, బరువు !