Saraswati Pushkaralu 2025 : త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ పుణ్య స్నానం
Saraswati Pushkaralu 2025 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదలైన ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం
- By Sudheer Published Date - 08:01 PM, Thu - 15 May 25

తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గురువారం నుండి సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaralu 2025) భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ప్రసరించే సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంగమంలో ఈ పుణ్యకాలం ప్రత్యేక ఆధ్యాత్మికతను కలిగిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదలైన ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నదీమాతల పూజలు, హారతులు నిర్వహించారు.
Miss World Contestants : బిఆర్ఎస్ కు మంత్రి సీతక్క కౌంటర్
పుష్కర ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ప్రతిష్టించిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల వసతి సముదాయాన్ని ప్రారంభించారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడంతో పుష్కర కాలం ప్రారంభమైంది. గురువారం ఉదయం 5:44 గంటలకు పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఘాట్ వద్ద ప్రత్యేక పూజలతో పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించి విస్తృత ఏర్పాట్లు చేసింది. తాగునీరు, పారిశుద్ధ్యం, స్నాన ఘట్టాలు, రహదారుల మరమ్మతులు, వాహనాల పార్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించారు. రాత్రి 6:45 నుంచి 7:35 వరకు సరస్వతి నవరత్నమాల హారతిని ప్రతిరోజూ నిర్వహించనున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ద్వారా భక్తుల రాకపోకలు సులభతరం చేయడంతో పాటు తాత్కాలిక టెంట్ సిటీ ఏర్పాటు చేసి వసతి సౌకర్యాలు కల్పించారు. పుష్కరాల కాలంలో రోజుకు సగటున లక్షన్నర మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.