CM Revanth Reddy Padayatra : ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ పాదయాత్ర..
Revanth Reddy Padayatra : ఈ పాదయాత్రలో ఆయన మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు
- By Sudheer Published Date - 03:44 PM, Mon - 4 November 24

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) ఈ నెల 8న పాదయాత్ర (Padayatra) ప్రారంభించబోతున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది వెంబడి పాదయాత్ర చేస్తారు.
ఈ పాదయాత్రలో ఆయన మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. పాదయాత్ర నేపథ్యంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హెలిప్యాడ్ మరియు ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
రేవంత్ పర్యటనలో భాగంగా..భువనగిరి నియోజకవర్గ పరిధి వలిగొండ మండలంలో గల బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో చేపట్టబోయే మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్రలో సీఎం పాల్గొననున్నారు. అలాగే మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పైప్‌లైన్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.
Read Also : Telangana Media Academy Chairman : శ్రీనివాస్ రెడ్డి ని సత్కరించిన కర్ణాటక రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్