CM Revanth Reddy : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ మరో శుభవార్త
CM Revanth : ఈ పథకం కింద రైతులకు నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి తెలిపారు
- Author : Sudheer
Date : 01-12-2024 - 4:56 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana ) రాష్ట్రంలోని రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా (Rythu Bharosa) (రైతుబంధు) పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద రైతులకు నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి తెలిపారు. రైతు భరోసా పథకం అమలు విధివిధానాలను త్వరలో నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయిస్తామని సీఎం వివరించారు. ఈ పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు దశలవారీగా పూర్తవుతున్నాయని వెల్లడించారు. రైతులకు ఈ పథకం ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందించడమే లక్ష్యమని సీఎం అన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కొన్ని వర్గాలు రైతులను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు రైతు భరోసా పథకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులు అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని ఆయన కోరారు. రైతుల కోసం ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తమ ప్రభుత్వం, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందని సీఎం వెల్లడించారు.
ఈ కొత్త పథకం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మద్దతు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, రైతుల ఆర్థిక భద్రతకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ తో పాటు వడ్లకు బోనస్ ఇస్తుండడంతో సంతోషంగా వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు రైతు భరోసా ఇస్తామని చెప్పడం .. సంక్రాంతి పండుగ అనంతరం పథకం అమలు చేస్తామని చెప్పడం తో రైతుల్లో నూతన ఉత్సహం మొదలైంది.
Read Also : Sri Seeta Rama Jananam : ANR తొలి సినిమాకు 80 ఏళ్లు