Free Breakfast Scheme : గవర్నమెంట్ స్కూళ్లలో ఇక ఫ్రీ టిఫిన్.. 6న ప్రారంభించనున్న కేసీఆర్
Free Breakfast Scheme : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో మరో కొత్త సంక్షేమ పథకం అమల్లోకి రాబోతోంది.
- Author : Pasha
Date : 04-10-2023 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
Free Breakfast Scheme : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో మరో కొత్త సంక్షేమ పథకం అమల్లోకి రాబోతోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ ఉచితంగా టిఫిన్ అందించే పథకాన్ని ఈనెల 6న అమలు చేయబోతున్నారు. ఈ పథకాన్ని శుక్రవారం రోజు రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభిస్తారు.అనంతరం అన్ని జిల్లాల్లో దాన్ని ప్రారంభిస్తారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లను పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి కలెక్టర్లు, సంబంధిత కార్యదర్శులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఉచిత అల్పాహార పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల గురించి వివరించారు.
We’re now on WhatsApp. Click to Join
అల్పాహార పథకం ప్రారంభోత్సవం కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి ఒక ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా ఎంపిక చేసి, ఈ నెల 6న జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా రంగారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తారని వెల్లడించారు. విద్యార్థులకు దసరా కానుకగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సంపూర్ణ అల్పాహారాన్ని అందించాలని ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం తెలంగాణ సర్కారు ప్రతీ సంవత్సరం 400 కోట్ల రూపాయలను (Free Breakfast Scheme) ఖర్చు చేయనుంది.