HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Speech In Liberation Day Celebrations

CM KCR Speech: విభ‌జన‌వాదుల‌తో జాగ్ర‌త్త‌: ‘స‌మైక్య‌త వ‌జ్రోత్స‌వాల్లో’ కేసీఆర్

తెలంగాణ స‌మాజాన్ని చీల్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని వ‌జ్రోత్స‌వాల్లో సీఎం కేసీఆర్ ఆందోళ‌న చెందారు.

  • By CS Rao Published Date - 12:04 PM, Sat - 17 September 22
  • daily-hunt
Cm Kcr
Cm Kcr

తెలంగాణ స‌మాజాన్ని చీల్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని వ‌జ్రోత్స‌వాల్లో సీఎం కేసీఆర్ ఆందోళ‌న చెందారు. మతతత్వంతో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మనుషుల మధ్య విభజన చేస్తూ సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దుష్ట శక్తుల ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని బీజేపీని ఉద్దేశించి విరుచుకుప‌డ్డారు. ఈ నేల ప్రశాంతంగా ఉండాలే కానీ, మళ్లీ బాధల్లోకి వెళ్లకూడదని అన్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా కొన్ని దశాబ్దాల పాటు అనుభవించిన ఆవేదన మళ్లీ వ‌స్తుంద‌ని హెచ్చరించారు.

పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా జాతీయ జెండాను కేసీఆర్ ఎగురవేసి, పోలీసు వందనం స్వీకరించారు. ఆ త‌రువాత జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ రాచరిక పాలనలో ఉన్న విష‌యాన్ని వివ‌రించారు. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగాల వల్ల తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పయనించిందని చెప్పారు. కొమ‌రం భీమ్, దొడ్డి కొమురయ్య వంటి మహనీయుల త్యాగాలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. ఆనాడు మహోజ్వలమైన ఉద్యమం నడించిందని, ఎందరో మహానుభావులు చైతన్యాన్ని రగిలించారని అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తలచుకుందామని పేర్కొన్నారు.

1948 నుంచి 1956 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉందని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి ఉండేదని, దోపిడీకి గురవుతున్నామనే భావన ప్రజల్లో రోజురోజుకూ పెరిగిందని అన్నారు. స్వరాష్ట్రం ఆకాంక్ష ఆనాడు బలపడిందని తెలిపారు. ఆ తర్వాత ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పోరాటం చేశానని, నిరాహార దీక్షకు కూడా దిగానని, చావు అంచుల వరకు వెళ్లానని గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో పురోగమించిందని కేసీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో కర్ణాటకను సైతం తెలంగాణ అధిగమించిందని తెలిపారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని వెల్ల‌డించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటు చేశామని అన్నారు. బంగారు తెలంగాణలో బీజేపీ చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆరోపించారు. అప్ర‌మ‌త్తంగా ఉంటూ విభ‌జ‌న వాదాన్ని వ్య‌తికిస్తూ స‌మైక్యం దిశ‌గా అంద‌రూ ముందుకు క‌ద‌లాల‌ని పిలుపునివ్వ‌డం కేసీఆర్ ప్ర‌సంగంలోని హైలెట్‌.

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పూర్తి ప్రసంగం

యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నాం.

స్వతంత్రం రాకముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండేది. కొంతభాగం బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించే బ్రిటిష్ ఇండియాగా ఉంటే.. మిగతా భాగం సంస్థానాధీశుల పాలనలో ఉండేది. కొన్ని ప్రాంతాలు ఫ్రెంచ్, పోర్చుగీస్ వారి వలస పాలనలో ఉండేవి. ప్రపంచంలో ఏ దేశమైనా పరిణామ క్రమంలో సమగ్ర స్వరూపాన్ని సంతరించుకుంది. మన భారతదేశం కూడా అంతే.

తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన మహోజ్వల సందర్భం మనందరికీ సువిదితమే. నాడు అవలంబించిన అనేక వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరపిన త్యాగాలలో నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే ఉంటాయి. యావత్ సమాజం పోరాడిన సందర్భంలో ఆ సన్నివేశానికి కొందరు నాయకత్వం వహించడం ప్రపంచ పోరాటాలన్నింటిలో కనిపించేదే. తెలంగాణలో సైతం ఆనాడు ఎందరో యుద్ధం చేశారు. ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారు. మరికొందరు సాంఘిక, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం.

ఆదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి, అడవిబిడ్డలను ఒక్కటి చేసి, జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకుందాం.

భూస్వాముల ఆగడాలకు బలయి పోయిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందాం. తన సొంత భూమి వందల ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీని సాధించిన మహా నాయకుడు రావి నారాయణరెడ్డికి ఘనమైన నివాళులర్పిద్దాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగిడి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించి, పివి నరసింహారావు వంటి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థను స్మరించుకుందాం. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపనను యజ్ఞంలా నిర్వహిస్తూ, కఠోరమైన జైలు శిక్షలకు వెరవకుండా మొక్కవోని ధైర్యంతో పోరాడిన సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామిల కృషిని కొనియాడుదాం.

భూపోరాటాలకు గొప్ప ప్రేరణనిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందాం. ఐలమ్మ పోరాటానికి దన్నుగా నిలిచి, ఉద్యమాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త, వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది, మచ్చలేని మహానాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డిని సవినయంగా స్మరించుకుందాం. జనగామసింహంగా పేరు గాంచిన నల్లా నర్సింహులునూ, జీవితాంతం పీడిత ప్రజల గొంతుకగా నిలిచి, గీత కార్మికుల అభ్యున్నతికోసం జీవితాన్ని అంకితం చేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ నూ, ప్రజా పోరాటానికి సేనానిగా నిలిచిన వీర యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవిల త్యాగాలను సదా స్మరించుకుందాం. పోరాటంలో పాలుపంచుకోవడమే కాకుండా ఆ పోరాట చరిత్రను గొప్పగా రికార్డు చేసిన దేవులపల్లి వేంకటేశ్వర రావుతో పాటు అట్టడుగు వర్గాల మేలు కోరిన ఉద్యమకారుడిగా, పార్లమెంటేరియన్ గా, శాసనసభ్యుడిగా ఎనలేని సేవలు అందించిన బద్దం ఎల్లారెడ్డి చైతన్యాన్ని పుణికిపుచ్చుకుందాం.

నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండియాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందాం. ఇంకా ఎందరో మహానుభావులు, తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ, సామాజిక చైతన్యాన్ని రగిలించారు తమ త్యాగాలతో చరిత్రను వెలిగించారు. వారందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

ఆసేతు హిమాచలం అన్ని వర్గాల ప్రజల్లో దేశం పట్ల విశ్వాసాన్ని నెలకొల్పడానికి నాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్ల నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది.

మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు భూమికగా, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం, మతాలకు అతీతంగా దేశభక్తి భావనను పాదుకొల్పిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నేతలు చేసిన అవిరళ కృషి వల్ల ఒక్కొక్క చిక్కు ముడి వీడిపోయింది. భారతదేశం ఏకీకృతమైంది.

భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రంగా వెలుగొందింది. శ్రీబూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగింది.మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించింది.

1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయినామనీ, తాము దోపిడీకి గురువుతున్నామనే ఆందోళన గూడు కట్టుకుంది. ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. సఖ్యత ఏర్పడలేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గాలికొదిలేసింది. తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైంది. ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది.

2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమశంఖం పూరించాను. తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, పధ్నాలుగేళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించాను. లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లేందుకు సిద్ధపడ్డాను. తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చింది. ప్రజా ఉద్యమం ఆశించిన గమ్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది.

తెలంగాణ ఏవిధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి.. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా నిలిచింది.

విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలలో అనతికాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశనం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది.

2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీ.ఎస్.డి.పి 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు పెరిగింది.

తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించింది. 2014 -15 లో రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86 శాతం అధికం కావడం మనందరికీ గర్వకారణం.

సంపదను పెంచాలి.. పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. అనేకరకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా 50 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నది. పేద, బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమేగాకుండా, వ్యవసాయోత్పత్తులు కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి.

స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం ఆరునెలల వ్యవధిలోనే అన్నిరంగాలకు 24 గంటలు నిర్విరామంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. నేడు దేశంలో అన్నిరంగాలకూ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కావడం మనందరికీ గర్వకారణం.

తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగించింది. కరువు కాటకాలతో విలవిల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. రైతు రుణమాఫీతోపాటూ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపింది. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ.. దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించింది.

మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత జలాలను నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తూ తెలంగాణ.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

గురుకుల ఆవాసీయ విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం. 1,011 గురుకుల విద్యాలయాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ గురుకులాల్లో ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతిఏటా 1 లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నది.

వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతున్నది. రాష్ట్రంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతోపాటు, వరంగల్ నగరంలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది.

హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో మరో 2 వేల పడకలను ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. వీటితోపాటు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు – పల్లె దవాఖానాలు చక్కని సేవలందిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వినూత్నమైన పథకం.. తెలంగాణకు హరితహారం. గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతానికి పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్నది. నేడు రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది. అడవుల పునరుద్ధరణతో పాటు సామాజిక వనాల పెంపకం, వాటి సంరక్షణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్నది. హరితవనాల అభివృద్ధి కోసం నూతనంగా అటవీ విశ్వవిద్యాలయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతున్నది.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హరిత నిధిని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించింది. ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణకు హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి, ఈ హరితక్రాంతి నిరంతర స్రవంతిగా కొనసాగడం కోసం గ్రీన్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది.

రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అందరికి భాగస్వామ్యం కల్పిస్తూ వారందించే విరాళాల ఆధారంగా గ్రీన్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలు సైతం తమ బడ్జెట్లో 10 శాతం విధిగా గ్రీన్ బడ్జెట్ కింద కేటాయిస్తున్నాయి.

ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వాతావరణం ఉన్నచోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుంది. అందుకు నిజమైన నిదర్శనం మన తెలంగాణ రాష్ట్రం. సుస్థిర పాలన, మెరుగైన శాంతిభద్రతలు, అవినీతికి, అలసత్వానికి ఆస్కారంలేని విధంగా రూపొందించిన టీఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం, ఈ మూడింటి వల్ల తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్లలో 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. 16 లక్షల 50 వేల ఉద్యోగాల కల్పన జరిగింది.

ఐటీ రంగంలో తెలంగాణ సాటిలేని ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తున్నది. 2014లో తెలంగాణ ఐటీరంగ ఎగుమతుల విలువ 57 వేల 258 కోట్లు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వ కృషితో 2021 నాటికి 1 లక్షా 83 వేల 569 కోట్లకు పెరిగింది. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 మాత్రమే ఉండగా, తెలంగాణ వృద్ధి రేటు 26.14 శాతంగా ఉండటం మన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేస్తున్నది.

ఐటీ ఉద్యోగాల సృష్టిలో మొన్నటివరకూ దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్న కర్ణాటకను తెలంగాణ రాష్ట్రం అధిగమించింది. ఈ ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో 7 లక్షల 80 వేల ఉద్యోగాల కల్పన జరిగింది.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచడంలో సఫలీకృతమైంది. నేడు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ చక్కని మౌలిక వసతులు సమకూరాయి. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరును కలిగి ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో డంపుయార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి. యువతకు మానసికోల్లాసంతో పాటు దేహధారుఢ్యం కూడా పెంపొందడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడుతాయి. పల్లె-పట్టణ ప్రగతిలో భాగంగా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు శరవేగంగా ఏర్పాటవుతున్నాయి.

ప్రభుత్వ కృషితో పరిశుభ్రమైన పచ్చని పల్లెలు రూపుదిద్దుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులు వరుసపెట్టి తెలంగాణ గ్రామాలను వరించడం మనందరికీ గర్వకారణం. అపూర్వమైన ఫలితాలను సాధించిన పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది.

ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి.

ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలి.
ఏ కొంచెం ఆదమరిచినా ఎంతటి బాధాకరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి మన తెలంగాణే మనకు ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. తాను కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఎంతోమంది జైలుపాలు కావలసి వచ్చింది, ఎన్నోజీవితాలు ఆహుతై పోవాల్సి వచ్చింది. ఆ చరిత్రంతా నేను వేరే చెప్పనక్కరలేదు. అది మనందరి ప్రత్యక్ష అనుభవం. సమీప చరిత్రలోనే జరిగిన తెలంగాణ ఉద్యమంలో మనమందరం ప్రత్యక్ష భాగస్వాములమే.

హక్కుల కోసం, అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అనుభవించిన ఘర్షణను తలచుకుంటే నేటికీ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. అటువంటి కష్టం, అటువంటి వేదన పొరపాటున కూడా మళ్లీ రాకూడదు. అందుకు నిశిత పరిశీలన, నిరంతర చైతన్యం కావాలి.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయి. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. మనుషుల మధ్య ఈ రకమైన విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మతం చిచ్చు ఈ విధంగానే విజృంభిస్తే అది దేశం యొక్క, రాష్ట్రం యొక్క జీవికనే కబళిస్తుంది. మానవ సంబంధాలనే మంట గలుపుతుంది. జాతి జీవనాడిని కలుషితం చేస్తుంది.
జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయి. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలి. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోమారు హెచ్చరిస్తున్నాను.

మీ అందరి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తిగా, అనునిత్యం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా, ఈ నేల పై నెలకొన్న శాంతి, సౌభ్రాతృత్వాలను గుండెల నిండా శ్వాసించే వ్యక్తిగా.. ప్రతీ క్షణం ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించే వ్యక్తిగా, అన్నింటికి మించి మీ బిడ్డగా ఈ విషయం మీకు చెప్పడం నా కర్తవ్యం. నా గురుతర బాధ్యత.

మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలి. జాతినిర్మాణంలో ఉజ్వల పాత్రను నిర్వహించాలి.

భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని అందరినీ కోరుకుంటూ మరోమారు యావత్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hyderabad Liberation Day
  • Telangana BJP
  • Telangana CM KCR

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd