BRS Twist on Modi : మోడీలేపిన విభజన గాయం!ఎన్నికల అస్త్రంగా బీఆర్ఎస్!!
BRS Twist on Modi : ఎన్నికల వేళ ఏ ఇష్యూ దొరికినా, దాన్ని అనుకూలంగా మలుచుకోవడం సహజం. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది.
- Author : CS Rao
Date : 20-09-2023 - 5:17 IST
Published By : Hashtagu Telugu Desk
BRS Twist on Modi : ఎన్నికల వేళ ఏ చిన్న ఇష్యూ దొరికినా, దాన్ని అనుకూలంగా మలుచుకోవడం సహజం. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది. అంతేకాదు, కల్వకుంట్ల కుటుంబంలోని లీడర్లు ఆ విషయంలో అందెవేసిన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ వేదికగా చేసిన రాష్ట్ర విభజన అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక శత్రువుగా మోడీని మలుస్తున్నారు. పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేయడం కల్వకుంట్ల ఫ్యామిలీ లీడర్ల చాకచక్యం.
తెలంగాణ రాష్ట్రానికి ఒక శత్రువుగా మోడీని..(BRS Twist on Modi)
ఉమ్మడి ఏపీని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చాలా ఇబ్బందులు పడింది. రాజకీయంగా నష్టపోతామని చెప్పినప్పటికీ సోనియాగాంధీ వినిపించుకోలేదు. ఏపీ లీడర్లు అధిష్టానం వద్ద ఎంత మొత్తుకున్నా, బైబిల్ సూక్తిని ఆమె వినిపించారట. విధిలేని పరిస్థితుల్లో మంత్రివర్గం నుంచి కొందరు బయటకు వచ్చారు. కాంగ్రెస్ భావజాలాన్ని దశాబ్దాలు వినిపించిన ఏపీ కాంగ్రెస్. లీడర్లు రాజీనామాలు చేశారు. అయినప్పటికీ పార్లమెంట్ హాలు తలుపులు మూసివేసి విభజన బిల్లును పాస్ చేశారు. ఆ సందర్భంగా పెప్పెర్ స్ప్రే ఉపయోగించడానికి ఏ మాత్రం వెనుకాడకుండా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అప్పట్లో సాహసించారు. చిమ్మ చీకట్లో పార్లమెంట్ వేదికగా మూజువాణి ఓటుతో విభజన బిల్లును (BRS Twist on Modi) ఆనాడు కాంగ్రెస్ మమ అనిపించింది. కానీ, ఇరు రాష్ట్రాల విభజన మాత్రం శాస్త్రీయంగా చేయలేదు.
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ
ఇప్పటికీ తెలంగాణ, ఏపీ ఆస్తుల పంపకం కాలేదు. విభజన చట్టాన్ని అమలు చేయడానికి కేంద్రం కూడా ముందుకు రావడంలేదు. ఆనాడు ప్రత్యేక హోదాను ఏపీకి ప్రకటించినప్పటికీ దాన్ని చట్టంలో పెట్టలేదు. దీంతో ఏపీ వ్యాప్తంగా అసంతృప్తి ఇప్పటికీ రగులుతోంది. దశాబ్దాల పాటు తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా ఏపీ ఓటర్లు చేయగలిగారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. ఇక రాష్ట్రం ఇచ్చిన సంతోషం తెలంగాణ ప్రజల్లోనూ లేదు. ఒక వేళ అదే ఉంటే, కాంగ్రెస్ పార్టీని 2014, 2018 ఎన్నికల్లో అధికారంలోకి ఆ పార్టీ వచ్చేది. అదే విషయాన్ని మోడీ పార్లమెంట్ వేదికగా అన్నారు. గతంలోనూ తల్లిని చంపేసి బిడ్డను బతికించారని రాష్ట్ర విభజన మీద మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించిన (BRS Twist on Modi) కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ రెండు రాష్ట్రాల్లోనూ రక్తం చిందేలా విభజన జరిగిందని అన్నారు. ఆ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
Also Read : Jagan Cabinet Inside : మంత్రివర్గంలో `ముందస్తు`టాక్స్
తెలంగాణ రాష్ట్రం మీద మోడీ అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రులు హరీశ్, కేటీఆర్, కవిత ఆరోపణలకు దిగారు. విభజన తరువాత రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. కేంద్రం ఎలాంటి సహాయం చేయకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసుకున్నామని చెబుతున్నారు. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని మోడీ విభజన అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రప్తావించారని ఆరోపణలకు దిగారు. బీజేపీ పార్టీని తెలంగాణ వ్యాప్తంగా బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి బిల్లు పెట్టిందని ఆగ్రహించారు. దాని కారణంగా వెయ్యిమందికి పైగా ఆత్మబలిదానాలు చేసుకున్నారని విమర్శలకు దిగారు. అందుకే, ఢిల్లీ నేతలను తెలంగాణ వైపు చూడకుండా చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారా బంగారు తెలంగాణకు తుదిరూపు ఇవ్వాలని కోరడం విశేషం.
Also Read : Transgender Laila : తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్