BRS – MLC Elections : ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి బీఆర్ఎస్ దూరం.. ఎందుకు ?
BRS - MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుందా ?
- By Pasha Published Date - 11:41 AM, Sun - 7 January 24

BRS – MLC Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుందా ? పోటీతో పాటు ఓటింగుకూ దూరంగా ఉంటుందా ? అంటే ఔననే సమాధానమే రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిల రాజీనామాలతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ నెల 29న జరిగే రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు ఈనెల 11న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఐడియాను మార్చుకుంది. మొత్తం 119 మంది తెలంగాణ శాసనసభ సభ్యుల్లో కాంగ్రెస్‌కు 65 మంది, బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేల బలం(BRS – MLC Elections) ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. కనీసం ఒక స్థానాన్ని గెల్చుకోగలమని తొలుత బీఆర్ఎస్ అనుకుంది. అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పలువురి పేర్లను కూడా పరిశీలించింది. అయితే రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలను నిర్వహిస్తామని ఈసీ ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీ పునరాలోచనలో పడింది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉంటాయని గ్రహించి.. పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అసెంబ్లీ, సింగరేణి ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కేడర్ నిరుత్సాహంలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోయే బదులు.. దానికి దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయానికి గులాబీ పార్టీ పెద్దలు వచ్చారని అంటున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దీనిపై బీఆర్ఎస్ ప్రకటన చేయొచ్చని సమాచారం. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలపై మొత్తం ఫోకస్ పెట్టాలని కేసీఆర్ పార్టీ నిర్ణయించుకుందని చెబుతున్నారు.
Also Read: Message To India : ఇండియాకు బంగ్లాదేశ్ ప్రధాని థ్యాంక్స్.. ఏమన్నారంటే..
పార్టీ లీగల్ సెల్ సభ్యులతో చర్చించి ఎన్నికల అధికారులకు లిఖితపూర్వకంగా లేఖను అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రెండు స్థానాలకు ఒకే ఎన్నిక నిర్వహించకుండా, వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని ఎన్నికల అధికారులను నిలదీయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఈసీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఉందని అంటోంది. గతంలో ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సందర్భాలు వచ్చాయి. అయితే దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.