BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల.. కానీ కొన్ని షరతులు..!
సమాజంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ అరెస్ట్ అయిన గోషామహల్
- By Gopichand Published Date - 09:02 PM, Wed - 9 November 22

సమాజంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ అరెస్ట్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని, జైలు నుంచి విడుదలయ్యే వేళ ర్యాలీలు నిర్వహించరాదని, అదేవిధంగా మూడు నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేయొద్దని షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
మతవిద్వేషాలు రెచ్చగొట్టారని గత ఆగస్ట్ 25న పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ సతీమణి ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టులో వాద, ప్రతివాదనలు జరిగాయి. రాజాసింగ్ తరపు న్యాయవాది రవిచందర్ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించారు. పీడీ చట్టం కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రవిచందర్ గుర్తు చేశారు.
మరోవైపు ప్రతివాది అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కూడ రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని గట్టిగా వాదించారు. ఇప్పటికే ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదయ్యాయని ధర్మాసనం దృష్టికి తీసుకవచ్చారు. నిన్న జరిగిన వాదనలను పరిశీలించిన హైకోర్టు బుధవారం రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అయితే రాజాసింగ్ ఆగస్ట్ 25వ తేది నుంచి ఈరోజు వరకు రిమాండ్‌లో ఉన్నారు.