BJP Panchasutra: గెలుపు కోసం బీజేపీ ‘పంచసూత్ర’
అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆశలన్నీ గాల్లో తేలుతున్నాయి. ఇన్నాళ్లూ ఆడిందే ఆట. పాడింటే పాట. కానీ ఇప్పుడు సీన్ మారింది. పట్టు జారుతోంది.
- By hashtagu Published Date - 07:14 PM, Sun - 20 March 22

అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆశలన్నీ గాల్లో తేలుతున్నాయి. ఇన్నాళ్లూ ఆడిందే ఆట. పాడింటే పాట. కానీ ఇప్పుడు సీన్ మారింది. పట్టు జారుతోంది. అందుకే గులాబీ బాస్.. ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారు. అయినా అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుకే కదా. అందుకే కేసీఆర్ వ్యూహాలను పన్నినా, పీకే కొత్త స్కెచ్ లు వేసినా సరే.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీ పంచ సూత్ర ఫార్ములాను ప్రయోగించబోతోంది.
అసలే నాలుగు రాష్ట్రాల్లో అఖండ విజయం తరువాత బీజేపీకి ఎదురేలేకుండా పోయింది. ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ తో ఉన్న పార్టీ.. ఇప్పుడు మరింతగా దూకుడు పెంచనుంది. అధికారాన్ని అందుకోవడానికి భారీగా అవకాశాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని బీజేపీకి తెలుసు. అందుకే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా వచ్చే నెలలో తెలంగాకు రాబోతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణలో ఒక జిల్లాలో పెట్టబోయే బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. దీనిని బట్టి కమలనాథులు ఈ రాష్ట్రంపై ఎంతగా ఫోకస్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు.
వచ్చే నెల 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో రెండో దశను ప్రారంభించబోతున్నారు. దీనికన్నా ముందు ఈనెల 21 నుంచి 24 తేదీల మధ్య.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్
ఛార్జ్ తరుణ్ చుగ్ 8 జిల్లాలో గ్రౌండ్ లెవల్లో పర్యటించబోతున్నారు. అంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేసేలా బీజేపీ పెద్ద ప్లాన్ తోనే అడుగులు వేస్తోంది. అందుకే కేసులకు కూడా భయపడకుండా ఢీ అంటే ఢీ అనేలా దూసుకెళ్లండని అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 6 శాతం ఓట్లు వచ్చాయి. అక్కడి నుంచి ఆరు నెలలు కూడా గడవక ముందే 2019 సార్వత్రిక ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. అంటే గ్రౌండ్ లెవల్లో బీజేపీకి బలం పెరుగుతుందని దీని అర్థం. అందుకే పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేరికలపై దృష్టి పెట్టడానికి డిసైడ్ అయ్యింది. టీఆర్ఎస్ అసంతృప్త నేతలే బీజేపీ ఫస్ట్ టార్గెట్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే.. పోటీ చేయడానికి సిద్ధంగా ఉండేలా.. దాదాపు 110 నియోజకవర్గాల్లో ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లతో జాబితాను సిద్ధం చేయబోతోంది.
తెలంగాణలో మొత్తం 12 ఎస్టీ సీట్లు ఉన్నాయి. 19 ఎస్సీ అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్కడ ఆయా వర్గాలే కాకుండా ఇతర వర్గాల అభిప్రాయాలనూ సేకరిస్తోంది. ఇతర పార్టీల అభ్యర్థుల బలాలు, బలహీనతలపై రిపోర్ట్ కూడా రెడీ చేసుకుందని సమాచారం. ఇక రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ.. పోలింగ్ బూత్ నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. పార్టీలో అన్ని విభాగాలు, నేతల మధ్య కోఆర్డినేషన్ పక్కాగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడి ప్రజల అభిమానాన్ని పొందేలా స్కెచ్ వేసింది. దీనికి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బీజేపీకి ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. టీఆర్ఎస్ నుంచి దాదాపు 45 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇది నిజమా కాదా అన్నదానికన్నా.. బీజేపీ పక్కా మైండ్ గేమ్ ఆడుతోందని మాత్రం
అర్థమవుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా అదే. ఇలాంటి పొలిటికల్ గేమ్స్ బీజేపీకి కొత్త కాదు. 2014 నుంచి కమలం ప్రయాణాన్ని పరిశీలిస్తున్నవారికి దీని గురించి బాగా తెలుసు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే.. 80కి పైగా సీట్లలో విజయం సాధిస్తామన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ధీమాకు ఇదే కారణమన్న వాదనా ఉంది. మొత్తానికి టీఆర్ఎస్ తొలి దఫా ప్రయాణంలో ఇబ్బందులు లేకపోయినా.. రెండోసారి పవర్ లోకి వచ్చిన తరువాత మాత్రం బీజేపీ రూపంలో గట్టి సవాల్ ఎదురవుతోందన్నది నిజం. దీనివల్లే ఎలక్షన్ స్ట్రాటజీలో ఆరితేరిపోయిన కేసీఆర్ కూడా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.