Assembly : అప్పులపై హరీష్ – భట్టీల మధ్య వాడీవేడి చర్చ
Assembly : 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసినట్లు బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు
- By Sudheer Published Date - 01:55 PM, Tue - 17 December 24

తెలంగాణ శాసనసభ(Telangana Assembly)లో రాష్ట్ర అప్పుల గురించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)మరియు బిఆర్ఎస్ మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు (Harishrao) మధ్య వాడివేడి చర్చ జరిగింది. నేడు ప్రశ్నోత్తరాల సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర అప్పుల వివరాలను వెల్లడించారు. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసినట్లు బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
ఏడాది కాలంలోనే ఇంత అప్పు చేస్తే..మరో నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.6.36 లక్షల కోట్ల అప్పు చేస్తుందని చెప్పుకొచ్చారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనేది పూర్తిగా అవాస్తవని ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.4.47 లక్షల కోట్ల అప్పు ఉంటే రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టుగా చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే తాము రాష్ట్ర అప్పులపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని స్పష్టం చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయాక కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని.. సభలు వాస్తవాలు మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని , పైగా చేసిన అప్పులను దాచేసి.. తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అప్పులు దాచడమే కాకుండా.. తిరిగి తమపైకి మాటల దాడికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ లో అప్పులపై చర్చ జరగాలనే తాము శ్వేతపత్రం విడుదల చేశామని , రాష్ట్ర అప్పులపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని భట్టి తెలిపారు. అప్పులపై సభలో చర్చకు భట్టి చేసిన సవాలును తాము స్వీకరిస్తున్నామని.. చర్చకు సిద్ధమని హరీశ్ రావు ప్రకటించారు.
Read Also : One Nation One Election : లోక్‌సభ ఎదుటకు జమిలి ఎన్నికల బిల్లులు.. కేంద్రంపై విపక్షాలు ఫైర్