Bathukamma : గిన్నిస్ రికార్డు సాధించిన బతుకమ్మ
Bathukamma : ఈ వేడుకలకు మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. బతుకమ్మ పండుగ కేవలం ఆడవారి పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సంస్కృతి అని వారు ప్రసంగించారు
- By Sudheer Published Date - 09:54 PM, Mon - 29 September 25

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియం బతుకమ్మ (Bathukamma ) పండుగతో కిక్కిరిసిపోయింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. మైదానంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల బరువైన భారీ బతుకమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద బతుకమ్మగా గుర్తింపు పొందింది.
Kavitha New Party: సద్దుల బతుకమ్మ సాక్షిగా కొత్త పార్టీపై కవిత ప్రకటన
ఈ భారీ బతుకమ్మ చుట్టూ 1,354 మంది మహిళలు లయబద్ధంగా ఆడిపాడి తమ సాంప్రదాయాన్ని ప్రదర్శించారు. ఒకే వేదికపై ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు జానపద నృత్యం చేయడం చారిత్రక ఘట్టమని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో రెండు విభాగాల్లో – భారీ బతుకమ్మ మరియు అతిపెద్ద జానపద నృత్యం – గిన్నిస్ రికార్డుల్లోకి ఈ వేడుకలు చేరాయి. తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించే ఈ రికార్డు వేడుకలు రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చాయి.
ఈ వేడుకలకు మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. బతుకమ్మ పండుగ కేవలం ఆడవారి పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సంస్కృతి అని వారు ప్రసంగించారు. భవిష్యత్తులో కూడా బతుకమ్మ పండుగను మరింత వైభవంగా నిర్వహించి ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ ఘన వేడుకలు తెలంగాణ మహిళల ఐక్యత, సృజనాత్మకత, సంస్కృతికి ఒక నిదర్శనంగా నిలిచాయి.