Bathukamma Celebrations : బతుకమ్మ సంబరాలకు సిద్దమైన ఆడబిడ్డలు
bathukamma celebrations
- By Sudheer Published Date - 08:05 PM, Tue - 1 October 24

Bathukamma Celebrations 2024 : బతుకమ్మ సంబరాలకు (Bathukamma Celebrations) తెలంగాణ ఆడబిడ్డలు సిద్ధమయ్యారు. ప్రతీ యేటా భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ తొమ్మిది రోజుల పాటూ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూ వాడా ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు రోజుకో విధమైన బతుకమ్మను పేర్చి పండుగ సంబరాలు జరుపుకుంటారు. రేపటి నుండి ఈ బతుకమ్మ సంబరాలు మొదలుకాబోతున్నాయి.
రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు.ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో ఎటు చూసిన అడవి పూలు అందంగా విరబూసి పలకరిస్తున్నాయి.
మొదటిరోజు : ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
రెండో రోజు : అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
మూడో రోజు : ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నాల్గో రోజు : నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
ఐదో రోజు : అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆరో రోజు : అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
ఏడో రోజు : వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు : వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
తొమ్మిదో రోజు : సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకేవి. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేసేవారు. అలాగే బతుకమ్మ కోసం ప్రత్యేక నిధులు విడుదల చేసి..ప్రతి పల్లె నుండి పట్టణం వరకు బతుకమ్మ ఆడేచోట లైటింగ్ , డీజే లు పెట్టె ఎంతో సంబరంగా చేసేవారు. కానీ ఈసారి మాత్రం అలాంటిదేమి లేదు.