MP Bandi Sanjay : గతంలో విషయాలను ప్రస్తావిస్తూ.. కిషన్ రెడ్డిపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను ఎంపీ బండి సంజయ్ కోరారు.
- Author : News Desk
Date : 06-07-2023 - 6:55 IST
Published By : Hashtagu Telugu Desk
కరీంనగర్ బీజేపీ ఎంపీ, మాజీ అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay) కేంద్ర మంత్రి, నూతన అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 8న ఓరుగల్లులో ప్రధాని మోదీ (PM Modi) సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు, బీజేపీ శ్రేణులు తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని సంజయ్ కోరారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు తనకు సంతోషంగా ఉందని అన్నారు. నన్ను రారాపోరా అనే చనువు కిషన్ రెడ్డికి మాత్రమే ఉందని సంజయ్ అన్నారు. విద్యార్థి పరిషత్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కిషన్ రెడ్డికే ఫోన్ చేసేవాడిని అని, కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తోందని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తోన్న ప్రచారాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. సందట్లో సడేమియాగా ఇతర పార్టీల వారు అవకాశంగా తీసుకుంటున్నారని పార్టీ శ్రేణులకు సంజయ్ సూచించారు.
బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని, కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని ఓడించటానికి కలసికట్టుగా పనిచేస్తామని, ఈనెల 8న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను సంజయ్ కోరారు.
KA paul: నా డబ్బుంతా అమెరికాలో ఉంది.. కేసీఆర్‌కు నేనంటే అందుకే భయం!