Bandi Sanjay: గ్రేటర్‌లో బండి యాత్ర.. అడ్డంకులు తప్పవా ?
బీజేపీ తెలంగాణ దళపతి బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు.
- Author : Naresh Kumar
Date : 11-09-2022 - 8:49 IST
Published By : Hashtagu Telugu Desk
బీజేపీ తెలంగాణ దళపతి బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రకు అనుమతి లభించిందా? యాత్రకు అడ్డంకులు తప్పవా ?
బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర అనేక ఆటంకాల మధ్య కొనసాగింది. పాదయాత్రకు అనుమతి లేదంటూ జనగామ దగ్గర బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు. దీంతో కమలం పార్టీ హైకోర్టు తలుపు తట్టింది. న్యాయస్థానం అనుమతితో పాదయాత్రను తిరిగి కొనసాగించారు. ఈ నేపథ్యంలో నాలుగో విడత పాదయాత్రపై కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. నాలుగో విడత పాదయాత్ర మూడు కమిషనరేట్ల పరిధిలో సాగుతున్న నేపథ్యంలో ముగ్గురు పోలీసు కమిషనర్లకు పాదయాత్ర వివరాలను బీజేపీ నేతలు అందజేశారు. పోలీసులకు ఇచ్చిన సమాచారాన్నే అనుమతిగా భావిస్తున్నారు కమలనాథులు.
పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పాదయాత్రకు ముందు బండి సంజయ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. గాజులరామారం చిత్తారమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. స్థానికి రాంలీలా మైదానంలో పాదయాత్ర ప్రారంభ సభ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈనెల 22న పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్ వద్ద పాదయాత్ర ముగింపు సభకు కమలం పార్టీ ప్లాన్ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా నాలుగో విడత పాదయాత్ర కొనసాగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్ తోపాటు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.ప్రభుత్వ వైఫల్యాలను పాదయాత్రలో ఎత్తిచూపాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. నగరంలో గతకుల రోడ్లు, కాలుష్యం, డంపింగ్ యార్డు, డ్రైనేజీ, ఫ్లై ఓవర్లు, స్కైవేలు, చెరువుల కబ్జా వంటి సమస్యలను పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కమలం పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12న కుత్బుల్లాపూర్ శ్రీ చిత్తారమ్మ దేవాలయం నుండి ప్రారంభం.
అనంతరం ప్రారంభోత్సవ బహిరంగ సభ
🕙 ఉ: 10 గం.లకు
📍 రాంలీల మైదానం, కుత్బుల్లాపూర్ముఖ్య అతిథి: శ్రీ @sunilbansalbjp గారు, @BJP4India జాతీయ ప్రధాన కార్యదర్శి#PrajaSangramaYatra4 pic.twitter.com/etzJOD9883
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 11, 2022