Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు తీరును ఖండించిన బండి సంజయ్
భారీగా జనాలు వచ్చిన కార్యక్రమానికి సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యమని బండి సంజయ్ భావించారు.
- By Latha Suma Published Date - 05:26 PM, Fri - 13 December 24

Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని దుస్తులు మార్చుకోవడానికి కూడా టైమ్ ఇవ్వకుండా బెడ్‌రూమ్ నుంచి అరెస్ట్ చేసి అగౌరవపరిచారని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. పెద్ద ఈవెంట్లకు ప్రభుత్వమే సరైన ఏర్పాట్లు చేయాల్సిందని బండి సంజయ్ ట్వీట్ చేశారు.
ప్రముఖ హీరో విషయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీగా జనాలు వచ్చిన కార్యక్రమానికి సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యమని బండి సంజయ్ భావించారు. ఇది నిర్లక్ష్యం, తప్పు అని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రత్యక్షంగా ప్రమేయం లేని అల్లు అర్జున్, ఆయన అభిమానులకు గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో వారిని నేరస్థులుగా చూడటం సరికాదని పేర్కొన్నారు.
కాగా, డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన ఘటన పై ఈ కేసు నమోదైంది. ఆ క్రమంలో తొక్కిసలాటలో 39 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.