Amrapali Kata : సీఎం రేవంత్‌రెడ్డికి కార్యదర్శిగా కాట ఆమ్రపాలి..?
- By Sudheer Published Date - 11:39 AM, Tue - 12 December 23

ఆమ్రపాలి కాట (Amrapali Kata)..తెలియని వారు లేరు. ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే కుగ్రామంలో కాట వెంకటరెడ్డి, పద్మావతి దంపతులకు మొదటి సంతానంగా ఈమె జన్మించింది. వెంకటరెడ్డిది వ్యవసాయ కుటుంబమే అయినా ఆయన విశాఖపట్నంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. దీంతో ఆమ్రపాలి ఉన్నత చదువులు మొత్తం విశాఖపట్నంలోనే చదివింది. ఆమ్రపాలి 2010 ఐఏఎస్ (IAS) బ్యాచ్‌కు చెందిన అధికారిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ (Telangana)లో కలక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపికయ్యారు. అతి చిన్న వయసులో ఈ పోస్టులో ఎంపికైన వారిలో ఆమ్రపాలి ఒకరు. ఇప్పుడు ఈమె మళ్లీ తెలంగాణ కు రాబోతున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి కార్యదర్శిగా (సీఎంఓ సెక్రటరీ) వస్తున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా కొంతకాలం పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్‌కు వెళ్ళిన ఆమె తొలుత (2019 అక్టోబరు 29 నుంచి) కేంద్ర క్యాబినెట్‌లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది కాలం పనిచేశారు. ఆ తర్వాత (2020 సెప్టెంబరు 14న) పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆమె తిరిగి వచ్చేందుకు వీలుగా కేంద్రానికి దరఖాస్తు (రీపార్టియేషన్) చేసుకున్నారు. గతంలో ప్రధాని కార్యాలయంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ శేషాద్రి సూచనల మేరకు ఆమ్రపాలి తెలంగాణకు వస్తున్నట్లు సమాచారం. సెంట్రల్ డిప్యూటేషన్ (పీఎంఓలో) కాలం పూర్తికావడంతో తెలంగాణకు వచ్చిన శేషాద్రి కొంతకాలం జీఏడీలో పనిచేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సైతం సీఎంఓలోకి రావచ్చని సచివాలయ వర్గాల సమాచారం.
Read Also : Telangana High Court : మసీదుల్లోకి మహిళలను అనుమతించాలి – తెలంగాణ హైకోర్టు