Adivasi Fair: ‘ఆదివాసీ’ మీకు మీరే సాటి!
మేడారం సమక్కసారలమ్మ జాతర అంటేనే వనదేవతల దర్శనం.. భక్తులు పూజలు.. జంపన్న వాగులో స్నానాలు.. మాత్రమే కాదు.. ఆదివాసీల కళారూపాలు కూడా. మేడారంలో జాతరలో వీళ్లు ప్రత్యేకార్షణగా నిలుస్తూ భక్తులను ఆకట్టుకుంటారు. సాంప్రదాయ డోలు, ఇతర వాయిద్యాలను వాయిస్తూ వనదేవతలను స్వాగతిస్తారు.
- By Balu J Published Date - 05:02 PM, Fri - 18 February 22

మేడారం సమక్కసారలమ్మ జాతర అంటే వనదేవతల దర్శనం.. భక్తులు పూజలు.. జంపన్న వాగులో స్నానాలు.. మాత్రమే కాదు.. ఆదివాసీల కళారూపాలు కూడా. మేడారంలో జాతరలో వీళ్లు ప్రత్యేకార్షణగా నిలుస్తూ భక్తులను ఆకట్టుకుంటారు. సాంప్రదాయ డోలు, ఇతర వాయిద్యాలను వాయిస్తూ వనదేవతలను స్వాగతిస్తారు. అందుకే ఆదివాసీ ప్రదర్శనలు పిల్లల నుంచి పెద్దల వరకు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వాళ్లు డప్పు లయబద్ధంగా వాయిస్తుంటే.. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే మరిచిపోతారు. తరతరాల నుంచి కళారూపాలను కాపాడుకుంటూ తమకు తామే సాటి అని చాటిచెప్తున్నారు. ములుగు జిల్లాలోని మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంటారు వీళ్లు. ఆదివాసీ గిరిజనుల సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రకృతి మాత పట్ల వారికున్న ప్రగాఢ ఆరాధనను చాటిచెప్పే ప్రదర్శనతో అందరినీ అలరిస్తుంటారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కోయరంగాపురానికి చెందిన కొమ్ము కోయ కళాకారుల బృందం సంప్రదాయ వేషధారణలతో చేసే డాన్సులు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గురువారం మెగా గిరిజన జాతరకు కళాకారులు బైసన్ కొమ్ములతో సంప్రదాయ శిరస్త్రాణాలు ధరించి, వనదేవతల ఊరేగింపులో పాల్గొంటారు. అప్పుడు అందరీ కళ్లు వనదేవతలతో పాటు ఆదివాసీల ప్రదర్శన వైపూ మళ్లుతాయి.
గిరిజన దేవతలను స్తుతిస్తూ, సాంప్రదాయ డోలు దరువులు, లయబద్ధమైన కొమ్ము కోయ నృత్యంతో జోష్ తీసుకొస్తారు. కొమ్ము కోయ, ఇతర ఆదివాసీ విభిన్న కళారూపాలు ఆదివాసీలకు ప్రకృతి తల్లికి మధ్య సహజీవన సంబంధాన్ని తెలియజేస్తాయని కోయరంగాపురం గ్రామానికి చెందిన కళాకారుడు మల్లయ్య చెప్పారు. ఆదివాసీల దైనందిన జీవితంలోని సంప్రదాయ కళారీతులు తరతరాలుగా ముడిపడి ఉన్నాయి.
ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య చురుకైన ప్రోత్సాహంతో మా సాంస్కృతిక బృందాల సభ్యులు మేడారం జాతరలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర గిరిజన కళాకారులతో కలిసి మా ప్రతిభను ప్రదర్శించే అద్భుతమైన అవకాశం లభించిందని ఆయన చెప్పారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని కోయరంగాపురం, తిమ్మంపేట గ్రామాలకు చెందిన రెండు గిరిజన కళాకారుల బృందాలు ప్రస్తుతం మేడారంలో విడిది చేసి సంప్రదాయ రేల, కొమ్ము కోయ కళారూపాలను ప్రదర్శిస్తున్నాయని భద్రాచలం ఐటీడీఏలోని మినీ మ్యూజియం క్యూరేటర్ వీరాస్వామి తెలిపారు.