illegal Liquor Shops: పచ్చని కాపురాల్లో ‘మద్యం’ చిచ్చు!
అదొక పచ్చని పల్లె.. కొందరు కూలీ పనులు, మరికొందరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోశించుకునేవాళ్లు. వచ్చే సంపాదనతో హాయిగా బతికేవాళ్లు. అలాంటి పల్లెలోకి మద్యం ప్రవేశించి వాళ్ల జీవితాలను అతలాకుతలం చేసింది.
- By Balu J Published Date - 01:08 PM, Sat - 26 February 22

అదొక పచ్చని పల్లె.. కొందరు కూలీ పనులు, మరికొందరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోశించుకునేవాళ్లు. వచ్చే సంపాదనతో హాయిగా బతికేవాళ్లు. అలాంటి పల్లెలోకి మద్యం ప్రవేశించి వాళ్ల జీవితాలను అతలాకుతలం చేసింది. ఫలితంగా కుటుంబ పెద్దలు మద్యానికి బానిసలై తనువు చాలిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. మెతుకు సీమ మెదక్ లో చోటుచేసుకుంది.
జనవరి 17న తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లికి చెందిన మీసాల నవీన్ అనే 25 ఏళ్ల దినసరి కూలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగు నెలల్లో గ్రామాన్ని కుదిపేసిన ఐదు మరణాలలో ఇదో ఒకటి. మరణించిన ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు దళితులు మద్యానికి బానిసలు. 3000 కంటే తక్కువ జనాభా మారేపల్లిలో గ్రామానికి ప్రజా రవాణ అంతంతమాత్రమే. అయినా అక్కడ బెల్ట్ షాపుల్లో మద్యం దందా జోరుగా కొనసాగుతోంది. మారుమూల గ్రామాల్లో సైతం మద్యం ఏరులై పారుతున్నా సంబంధిత అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవీన్ మరణించిన ఒక రోజు తర్వాత, దళిత మహిళలు, యువకులు గ్రామంలోని ఆరు బెల్ట్ షాపుల వద్దకు వెళ్లారు. ఆత్మహత్య చేసుకున్న మరణాల వెనుక మద్యం వ్యసనం ఉందని ఆరోపించారు. మద్యం విక్రయాలు నిలిపివేయాలని మహిళలు దుకాణ యజమానులను కోరినట్లు సమాచారం. యజమానులు వినిపించుకోకపోవడంతో మహిళలు వాగ్వాదానికి దిగారు. అయితే అల్లర్లు, లూటీలకు పాల్పడినట్లు దళితులపై పోలీసులు కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, అక్రమ మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కొండాపూర్ పోలీసులు 19 మందిపై సెక్షన్ 147 అల్లర్లు, ఆస్తులు లూటీ చేయడం, గాయపర్చడం లాంటివి పరిగణనలోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. గ్రామంలో బెల్టుషాపు నిర్వహిస్తున్న పుర్ర మహేష్ గౌడ్‌పై దాడి చేసి దుకాణంలో ఉన్న రూ.30వేలు లాక్కెళ్లారని దళితులపై అభియోగాలున్నాయి.
జనవరి 24న కౌన్సెలింగ్ పేరుతో బుక్కైన వారందరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు.. కొన్ని పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించారని ఆరోపించారు. అయితే దళితుల ప్రకారం.. కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లోని సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పేపర్‌పై సంతకం చేయకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పిడి యాక్ట్) కింద కేసు నమోదు చేస్తానని, రౌడీషీట్ తెరుస్తానని బెదిరించాడు. సంగారెడ్డి జిల్లా జైలులో నలుగురు మహిళలు సహా 13 మందిని 10 రోజుల పాటు నిర్బంధించారు. దళితులు జనవరి 18న పలుమార్లు ఫిర్యాదులు చేసినా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు పుర్ర అశోక్ గౌడ్, గౌండ్ల చెన్నం గౌడ్, నిమ్మగారి లక్ష్మయ్య, కంబాలపల్లి రాజు, గోవిందపురం మాణెయ్య, పుర్ర రాజులపై కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఏరులై పారుతుండటంతో అరికట్టేందుకే స్థానికులు ముందుకొచ్చారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దాదాపు 150 మంది దళితులు గుమిగూడి ప్రతిజ్ఞ చేశారు “మారేపల్లి నుంచి బెల్టుషాపులను నిషేధించాలని మేం ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. కాలనీ వాసులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని, రోజువారీ కూలీ ద్వారా వచ్చే సంపాదనంతా మద్యానికే ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువకులను మద్యం దుకాణాల్లో పని కల్పంచి, డబ్బలులు ఇవ్వకుండా దానికి బదులుగా మద్యం సీసాలు ఇస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.