Asifabad: అసిఫాబాద్ జిల్లాలో అరుదైన శిల్పాలు లభ్యం!
అరుదైన శిల్పాలు, గొప్ప చారిత్రక సంపదకు నిలయంగా మారుతోంది తెలంగాణ. అప్పుడప్పుడు అరుదైన శిల్పాలు వెలుగుచూస్తుండటమే ఇందకు ఉదాహరణగా చెప్పొచ్చు.
- By Balu J Published Date - 04:15 PM, Tue - 8 March 22

అరుదైన శిల్పాలు, గొప్ప చారిత్రక సంపదకు నిలయంగా మారుతోంది తెలంగాణ. అప్పుడప్పుడు అరుదైన శిల్పాలు వెలుగుచూస్తుండటమే ఇందకు ఉదాహరణగా చెప్పొచ్చు. గత కొద్దిరోజుల క్రితం నల్లగొండ జిల్లాలో ‘పల్లవుల’ కాలానికి చెందిన శిల్పాలు వెలుగుచూసిన ఘటన మరువకముందే, తాజాగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బోరిలాల్‌గూడ శివార్లలోని వ్యవసాయ పొలాల్లో 6.6 కోట్ల ఏళ్ల నాటి శిలాజ అవశేషాలు బయటపడ్డాయి. ‘నవ తెలంగాణ హిస్టరీ గ్రూప్’ సభ్యులు అహోబిలం కరుణాకర్, బివి భద్ర గిరీష్, ఎస్.వేణుగోపాలాచార్యులు, కెరమెరి తిరుగీత అన్వేషణ చేశారు. ఆ సమయంలో శిలాజాలను కలిగి ఉన్న చెర్ట్ (ఒక రకమైన అవక్షేపణ శిల) కనుగొన్నారు. అయితే ఇవన్నీ ఎలాంటి అలంకారాలు లేకుండా కొంత త్రిభుజాకారంలో ఉన్నాయి.
ఈ ప్రాంతం శిలాజాలతో నిండి ఉందని, ఇతర సూక్ష్మ శిలాజాలు, ఆస్ట్రాకోడ్‌లు, ఛారోఫైట్‌లు ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అయితే శిలాజాలు దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల క్రితానికి చెందినవని తెలుస్తోంది. ఈ ప్రాంతం నాగ్‌పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల మధ్య ఉంది. తెలంగాణలో అరుదైన శిల్పాలు, కట్టడాలు బయటపడటం కొత్తేమీ కాదు. ఆలయాలు, పురావస్తు స్థలాల దగ్గర తవ్వకాలు చేపట్టినప్పుడు శిల్పాలు, ఇతర అరుదైన సంపద వెలుగులోకి వస్తుంది. ఇవన్నీ పాతకాలంనాటి విషయాలను గుర్తుచేస్తున్నాయి. కాకతీయులు, పల్లవులు, ఇతర రాజ వంశాలకు చెందిన ఆనవాళ్లు వస్తువుల రూపంలో వెలుగుచూస్తున్నాయి. అందుకే తెలంగాణ చరిత్రకారులు తరచుగా పర్యటిస్తూ.. పాతకాలం నాటి శిల్ప సంపదను వెలుగులోకి తెస్తున్నారు.