Rain Effect : తెలంగాణలో భారీ వర్షాలు.. 36 రైళ్లు పూర్తిగా రద్దు
Rain Effect : మొత్తం 36 రైళ్లు పూర్తిగా రద్దవగా, 25 రైళ్ల మార్గాలను మార్చారు. అదనంగా 14 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు
- By Sudheer Published Date - 06:15 PM, Thu - 28 August 25

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు రైల్వే రవాణాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుని పలు రైళ్లను రద్దు చేసింది. మొత్తం 36 రైళ్లు పూర్తిగా రద్దవగా, 25 రైళ్ల మార్గాలను మార్చారు. అదనంగా 14 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వీటిలో ఎక్కువగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Stomach Problems : కడుపు ఉబ్బరంతో బాధపడే వారికి జామ ఆకులు బెస్ట్ మెడిసిన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలోని రైల్వే ట్రాక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి-బికనూర్-తలమడ్ల, అక్కన్నపేట్-మెదక్ మార్గాల్లోని పట్టాలపై భారీగా వరద నీరు ప్రవహించడం వల్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటితో పాటు కొన్ని చోట్ల పట్టాలు దెబ్బతినడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. దీంతో రైళ్లు సురక్షితంగా నడపలేని పరిస్థితి ఏర్పడింది.
రద్దైన రైళ్లలో కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-మెదక్, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి, నిజామాబాద్-తిరుపతి తదితర రైళ్లు ఉన్నాయి. వర్షాల తీవ్రత కొనసాగుతున్నందున రద్దయ్యే లేదా మార్గం మళ్లే రైళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా తెలుసుకొని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచించారు.