No Smartphones : 2030కల్లా స్మార్ట్ ఫోన్లకు చెల్లు చీటీ.. భవిష్యత్ మార్పుపై నోకియా సీఈవో సంచలన వ్యాఖ్యలు!!
మరో పదేళ్ల తర్వాత సంగతేమిటి ? " మార్పు" మాత్రం అనివార్యం. ఇంకొక మార్పేదో 2030 కల్లా ఫోన్ల మార్కెట్ లో జరగబోతోంది. సామాన్యులు దాని గురించి ఎంత చర్చించుకున్నా పెద్ద విలువ ఉండదు.
- By Hashtag U Published Date - 09:30 PM, Thu - 2 June 22

తొలుత ల్యాండ్ లైన్ ఫోన్లు..
వాటి తర్వాత నోకియా బండ పీసు ఫోన్లు..
ఆ తర్వాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు..
మరో పదేళ్ల తర్వాత సంగతేమిటి ? ” మార్పు” మాత్రం అనివార్యం. ఇంకొక మార్పేదో 2030 కల్లా ఫోన్ల మార్కెట్ లో జరగబోతోంది. సామాన్యులు దాని గురించి ఎంత చర్చించుకున్నా పెద్ద విలువ ఉండదు. కానీ ఫోన్ల మార్కెట్ ను దశాబ్దాల పాటు పిండేసిన ఉద్దండుడు మాట్లాడితే కచ్చితంగా మంచి విలువ ఉంటుంది. తాజాగా నోకియా కంపెనీ సీఈవో పెకా లుండ్ మార్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2030 కల్లా 6జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చి, ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లను అక్కరకు రాకుండా చేస్తుందని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సులో మాట్లాడుతూ లుండ్ మార్క్ ఈ కామెంట్స్ చేశారు. అప్పటిదాకా మనుషుల శరీరంలోకి చిప్స్ పెట్టేంత యోగ్యంగా టెక్నాలజీ అభివృద్ధి చెందొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే స్మార్ ఫోన్లు అక్కరకు రాకుండా పోతే.. వాటి స్థానంలో ఎలాంటి డివైజ్ లు వస్తాయనేది క్లారిటీ ఇవ్వలేదు. స్మార్ట్ గ్లాస్ లు, మొహంపై ధరించే రియాలిటీ పరికరాల వంటివి వాడుకలోకి రావచ్చని అభిప్రాయపడ్డారు.
కాగా, ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరా లింక్ అనే కంపెనీ మనుషుల మెదళ్లలో అమర్చగలిగే చిప్ లను అభివృద్ధి చేస్తోంది. సమీప భవిష్యత్తులో వీటిని తొలుత మెదడు, వెన్నెముక, మతిమరుపు, పక్షవాతం వంటి రుగ్మతలు కలిగిన వారికి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. క్రమంగా వాటిని అందరికీ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఈ చిప్ లను మెదడు లో ఇంజెక్టు చేసుకున్న వాళ్ళు.. తమ ఆలోచనలకు అనుగుణంగా ఫోన్లు, కంప్యూటర్లలోని యాప్స్ కు దిశానిర్దేశం చేయొచ్చు. లుండ్ మార్క్ చెప్పినట్టే జరుగుతుందా ? జరగదా ? అనేది తేలాలంటే మరో పదేళ్లు వేచి చూడాల్సిందే!!