BSNL 5G Phone: మార్కెట్ లోకి బీఎస్ఎన్ఎల్ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోందా.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ?
మార్కెట్లోకి బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ స్మార్ట్ ఫోన్ రాబోతుంది అన్న వార్తలపై ప్రముఖ టెలికాం కంపెనీ స్పందించింది.
- By Anshu Published Date - 03:20 PM, Wed - 14 August 24

ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయినా రిలయన్స్ జియో,ఎయిర్టెల్,వోడాఫోన్,ఐడియా కంపెనీలు ఇటీవల జూలైలో ప్రీపెయిడ్ అలాగే పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీఛార్జ్ లు వేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఇలా వరుసగా టెలికాం కంపెనీలు అన్నీ ధరలను పెంచడంతో కస్టమర్లు అందరూ చాలా వరకు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలామంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ కి మారిపోయారు. అన్ని టెలికాం కంపెనీలు ధరలు పెంచినా బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఎలాంటి రీఛార్జ్ ధరలను పెంచలేదు.
కేంద్ర ప్రభుత్వం కూడా బీఎస్ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. లక్ష టవర్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో బీఎస్‌ఎన్‌ఎల్ గురించి కొన్ని విషయాలు పుకార్లు షికార్లు అవుతున్నాయి. దీంతో జనాలు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఏ విషయం గురించి అయినా పుకార్లు వ్యాపించాలంటే అది సోషల్ మీడియానే అని చెప్పక తప్పదు. బీఎస్‌ఎన్‌ఎల్ తన 5జీ ఫోన్‌ను త్వరలో విడుదల చేయబోతోందని, అది కూడా 200 మెగా పిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్‌ఫాస్ట్ 5జీ కనెక్టివిటీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ఇలా 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తున్న వార్తలపై బీఎస్‌ఎన్‌ఎల్ స్పందించింది. ప్రభుత్వ టెలికాం సంస్థ తన అధికారిక X హ్యాండిల్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి విషయాలను నమ్మవద్దని, అంతా పచ్చి అబద్దమని తేల్చి చెప్పింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఫేక్ న్యూస్ ట్రాప్‌లో పడవద్దని, బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ నుండి నిజమైన వార్తలను తెలుసుకోవాలని సూచించింది. తాము ఎటువంటి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, దేశంలో 4జీ నెట్‌వర్క్ ఆగస్టు 15 నుంచి పూర్తి స్థాయిలో అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అంతేకాదు 5జీ నెట్‌వర్క్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.