Serena Williams: సెరెనా చివరి టోర్నీ ఇదేనా
అమెరికా నల్లకలువ , మహిళల టెన్నిస్‌లో గ్రేట్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ కెరీర్ తుది అంకానికి చేరింది.
- By Naresh Kumar Published Date - 01:33 PM, Fri - 26 August 22

అమెరికా నల్లకలువ , మహిళల టెన్నిస్‌లో గ్రేట్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ కెరీర్ తుది అంకానికి చేరింది. ఇటీవలే రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన సెరెనా విలియమ్స్ యుఎస్ ఓపెన్‌లో ఆడబోతోంది. ఆమె సుదీర్ఘ కెరీర్‌కు చివరి గ్రాండ్‌శ్లామ్ టోర్నీగా తెలుస్తోంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆమె మాంటెనిగ్రోకు చెందిన కొవిచ్‌తో తలపడనుంది. సుధీర్ఘ కాలంగా ఆటలో కొనసాగుతున్న సెరెనా విలియమ్స్ ఇటీవలే రిటైర్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
వోగ్ సెప్టెంబర్ సంచిక కవర్‌పై కనిపించిన తర్వాత, 40 ఏళ్ల టెన్నిస్ దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. జీవితంలో మనం వేరే దిశలో వెళ్లాలని నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుందని సెరెనా వ్యాఖ్యానించింది. దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు ఆ సమయాలు ఎల్లప్పుడూ కఠినంగా ఉంటాయన్న సెరెనా టెన్నిస్‌ను ఆస్వాదించడం తన గొప్పతనంగా అభివర్ణించింది. అయితే ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ చెప్పుకొచ్చింది. తన జీవితంలో టెన్నిస్ ఆట చాలనుకుంటున్నానని, అయితే దీనిని తాను రిటైర్మెంట్‌గా పిలవబోనంటూ వ్యాఖ్యానించింది. టెన్నిస్‌కు దూరంగా వెళుతున్నా.. జీవితంలోని ఇతర ప్రాధాన్యతల వైపు పూర్తిగా మళ్ళుతున్నానంటూ ట్వీట్ చేసింది. మహిళల టెన్నిస్ గ్రేట్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ తన కెరీర్‌లో మొత్తం 6 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె 1999, 2002, 2008, 2012, 2013, 2014 సంవత్సరాల్లో US ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అదే సమయంలో, ఆమె 23 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా కూడా నిలిచింది. అయితే కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్న ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. చివరిసారిగా సెరెనా గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయం సాధించింది. ఈ సారి యూఎస్ ఓపెన్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేస్తుంది.