ఆ మూడు జట్లకు కొత్త కెప్టెన్లు వీరేనా ?
ఐపీఎల్ మెగా వేలం ముగిసిపోవడంతో ఇక కొత్త కెప్టెన్లు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి వేలంలో మొత్తం 10 జట్లలో7 జట్లు తమ కెప్టెన్లను ఇప్పటికే ప్రకటించేశాయి.
- By Naresh Kumar Published Date - 07:30 PM, Tue - 15 February 22

ఐపీఎల్ మెగా వేలం ముగిసిపోవడంతో ఇక కొత్త కెప్టెన్లు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి వేలంలో మొత్తం 10 జట్లలో7 జట్లు తమ కెప్టెన్లను ఇప్పటికే ప్రకటించేశాయి. ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్ మూడు ఫ్రాంచైజీలు మాత్రం తమ జట్ల కెప్టెన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు..ఈ నేపథ్యంలో ఈ మూడు ఫ్రాంచైజీలలో కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టే సత్తా ఉన్న ఆటగాళ్లపై చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌లో అత్యంత ఆసక్తికరమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు వరుసలో ఉంటుంది. రిటైన్ జాబితాలో విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌తో పాటు సిరాజ్ ఉన్నారు. అయితే గత సీజన్‌లో కెప్టెన్‌గా కోహ్లి పక్కకు తప్పుకోవడంతో ఈ సీజన్‌లో కెప్టెన్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీలో కోహ్లీ, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, దినేశ్ కార్తిక్ సీనియర్ ఆటగాళ్లు. వీరిలో డుప్లెసిస్ , కార్తిక్ ఎక్కువ వయస్సు కలిగిన వారు. ఇక మ్యాక్స్‌వెల్‌కు కూడా 33 ఏళ్లు వచ్చేశాయి. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్ సారథిగా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈసారి కచ్చితంగా కప్ సాధించాలాని అనుకుంటున్న పంజాబ్ వేలంలో నిఖార్సైన ఆటగాళ్లను దక్కించుకుంది. శిఖర్ ధావన్ లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబాడ, ఓడియన్ స్మిత్, షారుక్ ఖాన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లు వేలంలో కొనుగోలు చేసింది.అయితే ఇందులో శిఖర్ ధావన్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ సారథిగా శిఖర్ ధావన్ కే అవకాశం దక్కొచ్చు. మరి పంజాబ్ యాజమాన్యం, మెంటార్ అనిల్ కుంబ్లే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
గతేడాది ఐపీఎల్ సీజన్‌లో అనూహ్య విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన కేకేఆర్ ఈ సారి పక్కా ప్రణాళిక ప్రకారం జట్టును ఎంచుకుని మరో టైటిల్ తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. వేలంలో భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు కేకేఆర్ సారధ్య బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే రిటెయిన్ చేసుకున్నవారిలో సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, అజింక్య రహానె వంటి సీనియర్లు.. మరోవైపు ప్యాట్ కమిన్స్, నితీశ్ రాణా, టిమ్ సౌథీ ఉన్నా.. ఫ్రాంచైజీ మాత్రం శ్రేయస్ వైపే మొగ్గు చూపుతూన్నట్లుగా తెలుస్తోంది.