Maaya Rajeshwaran : రైజింగ్ టెన్నిస్ స్టార్ మాయా రాజేశ్వరణ్.. ఎవరామె ?
తమిళనాడులోని కోయంబత్తూరులో 2009 సంవత్సరం జూన్ 12న మాయా రాజేశ్వరణ్ రేవతి(Maaya Rajeshwaran) జన్మించారు.
- By Pasha Published Date - 06:46 PM, Sat - 8 February 25

Maaya Rajeshwaran : సానియా మీర్జా తరహాలో మరో టెన్నిస్ స్టార్ మెరుపు వేగంతో రైజ్ అవుతోంది. ఆమె పేరు మాయా రాజేశ్వరణ్ రేవతి. వయసు 15 ఏళ్లు. మాయా రాజేశ్వరణ్ ఆటతీరు సెరెనా విలియమ్స్, సబలెంకాలను పోలి ఉందని క్రీడారంగ పరిశీలకులు అంటున్నారు. ‘వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్’ (డబ్ల్యూటీఏ) పాయింట్‌ను సాధించిన అతిపిన్న వయస్కురాలైన భారత టెన్నిస్ ప్లేయర్‌గా మాయా రాజేశ్వరణ్ రికార్డును సొంతం చేసుకుంది. నిలకడగా రాణిస్తూ ఆమె అందరి మన్ననలు అందుకుంటోంది. ఎల్ అండ్ టీ ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ 125 సిరీస్ ఈవెంట్‌లో మాయా రాజేశ్వరణ్ అసాధారణ ప్రదర్శనను కనబర్చింది. ఇటలీకి చెందిన 264వ ప్రపంచ ర్యాంకర్ నికోల్ ఫోస్సా హ్యూర్గోపై గెలిచి మరీ సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. తద్వారా డబ్ల్యూటీఏ పాయింట్ సాధించిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా రికార్డును సొంతం చేసుకుంది.
Also Read :Big Cheating : హీరోయిన్ చేస్తామంటూ మాజీ సీఎం కూతురికి రూ.4 కోట్లు కుచ్చుటోపీ
ఎవరీ మాయా ?
- తమిళనాడులోని కోయంబత్తూరులో 2009 సంవత్సరం జూన్ 12న మాయా రాజేశ్వరణ్ రేవతి(Maaya Rajeshwaran) జన్మించారు.
- ఆమె చిన్నతనంలో ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్‌లో భాగంగా టెన్నిస్‌ను ఎంచుకుంది. ఎనిమిదేళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత టెన్నిస్ క్రీడే ఆమెకు ప్రాణంగా మారింది.
- తొలుత ఆమెకు ఒకప్పటి భారత నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ రమేశ్ ట్రైనింగ్ ఇచ్చారు.
- తదుపరిగా ప్రో సర్వ్ టెన్నిస్ అకాడమీలో మాయా మరిన్ని మెళకువలను నేర్చుకున్నారు. అక్కడ కోచ్ మనోజ్ కుమార్ ఆమెకు ఐదేళ్ల పాటు టెన్నిస్ మెళకువలన్నీ నేర్పించారు.
- మెల్లార్కాలో ఉన్న రాఫెల్ నాదల్ అకాడమీలో ఒక వారం పాటు మాయా శిక్షణ తీసుకున్నారు. ఆ ట్రైనింగే తనకు కెరీర్‌లో కీలక మలుపుగా మారిందని మాయా రాజేశ్వరణ్ చెబుతున్నారు.
- తదుపరిగా తనకు ఏడాది పాటు శిక్షణ పొందే అవకాశం దక్కిందని ఆమె గుర్తు చేసుకున్నారు.