ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు అర్హత కోల్పోయిన వెస్టిండీస్ జట్టు .. పసికూనల చేతిలో చిత్తు
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు క్వాలిఫయర్స్‌లో ఓడిపోవటంతో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్-2023 మెగాటోర్నీకి అర్హత సాధించలేక పోయింది.
- Author : News Desk
Date : 01-07-2023 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్‌కు వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేక పోయింది. క్వాలిఫయర్స్ మ్యాచ్‌లోనే ఆ జట్టు ఇంటిబాట పట్టింది. పసికూన స్కాట్లాండ్ చేతిలో విండీస్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. అవమానకర రీతిలో టోర్నీ నుంచి ఆ జట్టు నిష్ర్కమించింది. వెస్టిండీస్ జట్టు గతంలో రెండు సార్లు వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. తాజాగా ఆ జట్టు మెగా టోర్నీకి అర్హత సాధించలేక పోవటం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. గత 48 ఏళ్లలో వన్డే ప్రపంచకప్‌కు వెస్టిండీస్ అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి.
స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టు కేవలం 42.3 ఓవర్లలో మరో ఏడు వికెట్లు మిగిలుండగానే విజయం సాధించింది. వెస్టిండీస్ జట్టు నిష్క్రమణతో సూపర్ సిక్సెస్‌లో ఇప్పటికే చెరో విజయం సాధించిన జింబాబ్వే , శ్రీలంకకు టాప్-10లో నిలిచేందుకు మార్గం సుగమమైంది.
వన్డే ప్రపంచకప్-2023 అతిథ్య టీమిండియా సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు అర్హత సాధించాయి. ఈ ఎనిమిది జట్లతో క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్సెస్ దశలో టాప్ -2లో నిలిచిన టీంలు వరల్డ్ కప్‌లో అడుగుపెడతాయి.