Vinesh Phogat : సొంతూరిలో వినేశ్ ఫొగాట్ ఎమోషనల్.. గ్రామస్తులు ఏం ఇచ్చారో తెలుసా?
ఈసందర్భంగా వినేశ్ కూడా కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Author : Pasha
Date : 18-08-2024 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
Vinesh Phogat : స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం అర్ధరాత్రి హరియాణాలోని తన స్వగ్రామం బలాలికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న వెంటనే ఆమె తన పెద్దనాన్న మహవీర్‌ను కలిశారు. వినేశ్‌ను ఆప్యాయంగా కౌగలించుకున్న మహవీర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈసందర్భంగా వినేశ్ కూడా కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భారత్‌కు వచ్చే ముందు వినేశ్ పెట్టిన పోస్టులో పెద్దనాన్న మహవీర్ ప్రస్తావన లేదు. దీంతో పలువురు నెటిజన్లు విమర్శలు చేశారు. తన పెద్దనాన్నను వినేశ్ మరిచిపోయిందని వారు కామెంట్స్ పెట్టారు. తాజాగా సొంతూరిలో పెద్దనాన్నను వినేశ్(Vinesh Phogat) కలవడంతో.. ఆ ప్రచారమంతా అబద్ధమేనని తేలిపోయింది.
We’re now on WhatsApp. Click to Join
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫైనల్‌కు వెళ్లినప్పటికీ.. ఆమె శరీర బరువు నిర్దిష్ట పరిమితిని మించిందని పేర్కొంటూ అనర్హత వేటువేశారు. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత నిరాశకు గురైన వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికారు. తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పైనా అనుకూలంగా తీర్పు రాలేదు. ఈనేపథ్యంలో భారత్‌లో వినేశ్ పెద్దనాన్న మహవీర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వినేశ్ ఇండియాకు వచ్చిన తర్వాత రిటైర్‌మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకోమని చెబుతాను. ఆమె తప్పకుండా ఒప్పుకుంటుంది’’ అని పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు తన పెద్దనాన్నను వినేశ్ కలవడంతో.. మళ్లీ ఆమె రెజ్లింగ్‌లోకి వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.
Also Read :Harbhajan Singh : కోల్‌కతా ఘటనపై హర్భజన్‌సింగ్ ఆగ్రహం.. దీదీకి, గవర్నర్‌కు బహిరంగ లేఖ
ఇక సొంతూరు బలాలిలో వినేశ్ ఫొగాట్‌కు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి 10 గంటలు జర్నీ చేసి ఆమె సొంతూరికి చేరుకున్నారు. బలాలి గ్రామానికి చెందిన వాళ్లంతా చెరో రూ.100 నుంచి రూ.200 దాకా వేసుకొని మొత్తం రూ.21వేలు జమ చేసి వినేశ్‌కు పారితోషికంగా అందించారు. వారి అభిమానానికి ముగ్ధురాలైన వినేశ్.. ఆ పారితోషికాన్ని గౌరవంగా స్వీకరించింది. చివరకు బలాలి గ్రామానికి చెందిన వాచ్‌మన్ కూడా వినేశ్‌కు రూ.100 పారితోషికం ఇచ్చాడు. గ్రామస్తులంతా కలిసి 750 కేజీల లడ్డూలను తయారు చేయించారు. వాటిని ఊరిలోని ప్రతీ ఇంటికి పంపిణీ చేశారు.