Team India: ఈడెన్‌లో సిరీస్ టార్గెట్‌గా టీమిండియా
న్యూఇయర్‌లో మరో సిరీస్‌పై కన్నేసింది టీమిండియా... శ్రీలంకపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది.
- By Anshu Published Date - 10:18 PM, Wed - 11 January 23

Team India: న్యూఇయర్‌లో మరో సిరీస్‌పై కన్నేసింది టీమిండియా… శ్రీలంకపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది. తొలి వన్డేలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రోహిత్‌సేనను అడ్డుకోవడం లంకకు సవాలే. సిరీస్ చేజారిపోకుండా ఉండాలంటే ఆ జట్టు అంచనాలకు మించి రాణించాల్సిందే. శ్రీలంకపై తొలి వన్డేలో సమిష్టిగా రాణించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. సిరీస్ గెలవడమే లక్ష్యంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డేలో తలపడబోతోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లతో పాటు విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
గత మ్యాచ్‌లో ఓపెనర్లు ఇచ్చిన ఆరంభం… కోహ్లీ మెరుపు శతకంతో టీమిండియా భారీస్కోర్ సాధించింది. కొత్త ఏడాదిలోనూ కోహ్లీ ఫామ్ జట్టుకు అడ్వాంటేజ్. ఓపెనర్లతో పాటు కోహ్లీ కూడా ఇదే జోరు కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. తొలి వన్డేలో మిగిలిన బ్యాటర్లు ధాటిగా ఆడే ప్రయత్నంలో త్వరగానే ఔటైనప్పటకీ.. వారు కూడా చెలరేగితే లంకకు కష్టాలే. అటు బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. తొలి వన్డేలో తన వేగంతో లంక బ్యాటర్లను కంగారెత్తించిన ఉమ్రాన్ మాలిక్ 3 కీలక వికెట్లతో సత్తా చాటాడు. అతనితో పాటు మహ్మద్ సిరాజ్ , హార్థిక్ పాండ్యా ఆకట్టుకోగా…షమీ భారీగా పరుగులివ్వడం ఇబ్బందిగా మారింది. ఓవరాల్‌గా బౌలర్ల ప్రదర్శనపై ఆందోళన లేదు. కాగా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో మరోసారి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమవ్వక తప్పేలా లేదు. వికెట్ కీపింగ్ బాధ్యతలను మరోసారి కెఎల్ రాహుల్‌కే అప్పగించనున్నారు. ఒకవేళ అతన్ని తప్పిస్తే ఇషాన్ కిషన్ కీపర్‌గా ఎంట్రీ ఇస్తాడు.
ఇక సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో లంకకు గెలుపు తప్పనిసరి. గత మ్యాచ్‌లో లంక అన్ని విభాగాల్లో చేతులెత్తేసింది. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోగా.. బ్యాటింగ్ కెప్టెన్ శనక, ఓపెనర్ నిస్సాంక మాత్రమే రాణించారు. శనక చివరి వరకూ పోరాడినా మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోయింది. సిరీస్ సమం చేయాలంటే రెండో వన్డేలో లంక అంచనాలకు మించిన రాణించాలి. అటు ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకే అనుకూలించే అవకాశముండడం హైస్కోరింగ్ గేమ్‌ను అంచనా వేస్తున్నారు. దీనికి తోడు మంచు ప్రభావం కూడా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు.