T20 Cricket : సూర్యకుమార్ ను ఊరిస్తున్న నెంబర్ 1
సూర్యకుమార్ యాదవ్...వరల్డ్ టీ ట్వంటీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్.. అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకునే ఈ ముంబై ప్లేయర్ కోహ్లీ, రోహిత్ లను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ వైపు దూసుకెళుతున్నాడు.
- By Hashtag U Published Date - 04:24 PM, Fri - 30 September 22

సూర్యకుమార్ యాదవ్…వరల్డ్ టీ ట్వంటీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్.. అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకునే ఈ ముంబై ప్లేయర్ కోహ్లీ, రోహిత్ లను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ వైపు దూసుకెళుతున్నాడు. వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత బ్యాటింగ్ కు కీలకం కానున్నాడు సూర్యకుమార్. షార్ట్ ఫార్మేట్ లో దూకుడుగా ఆడితేనే గుర్తింపు..జట్టులో చోటు ఉంటుంది. ఈ విషయాన్ని అత్యంత అనుకూలంగా మార్చుకున్న ఆటగాడు ప్రస్తుత భారత జట్టులో ఎవరైనా ఉన్నారంటే అది సూర్యకుమార్ యాదవ్ మాత్రమే. టీమిండియా బ్యాటింగ్ లో ఎప్పుడూ కోహ్లీ, రోహిత్ , పాండ్యా వంటి వారిపైనే అంచనాలుంటాయి. అయితే గత కొంత కాలంగా టీ ట్వంటీ ఫార్మేట్ లో హిట్టర్ గా అదరగొడుతున్నాడు సూర్యకుమార్. ప్రత్యర్థి ఎవరు.. ఆటలో పరిస్థితులతో సంబంధం లేకుండా ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు. ఏడాదికాలంగా నిలకడగా రాణిస్తున్న సూర్య గత ఏడాది కాలంగా ఎన్నో రికార్డులను అందుకున్నాడు. క్రికెట్ లో డివీలియర్స్ ఆటను ఇష్టపడని అభిమాని ఉండడు. అలాంటి ఏబీ ఆటను మరోసారి వరల్డ్ క్రికెట్ కు చూపిస్తున్నాడు సూర్యకుమార్. ఏబీ తరహాలోనే 360 డిగ్రీల్లో షాట్లు ఆడతాడు స్కై…ఇప్పటి వరకూ అతను ఆడిన చాలా మ్యాచ్ లలో డివీలియర్స్ తరహా షాట్లు చాలానే ఉన్నాయి. అందుకే చాలా మంది మాజీ ఆటగాళ్ళు సూర్య కుమార్ ను ఏబీ డివీలియర్స్ తో పోలుస్తారు. గత ఏడాది కాలంగా పరుగుల వరద పారిస్తున్న సూర్యకుమార్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టీ ట్వంటీలో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ యేడాది ఇప్పటి వరకూ సూర్య 732 రన్స్ చేయగా…గతంలో ధావన్ 689, కోహ్లీ 641 పరుగుల రికార్డును అధిగమించాడు. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగానూ నిలిచాడు. టీ ట్వంటీ కెరీర్ లో తన దూకుడు కొనసాగిస్తున్న సూర్యకుమార్ ఇప్పటి వరకూ 32 మ్యాచ్ లలో 39.04 యావరేజ్ తో 976 రన్స్ చేశాడు. దీనిలో 8 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. పొట్టి క్రికెట్ లో దూకుడు కొనసాగిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి అడుగుదూరంలో ఉన్నాడు. రేటింగ్ పాయింట్స్ కూడా 800 దాటడంతో ఇప్పుడు నంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ అగ్ర స్థానంలో ఉండగా.. సూర్య కుమార్ యాదవ్ ఇదే ఫామ్ కొనసాగిస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ లోపే సూర్య కుమార్ యాదవ్ నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకోవచ్చు.