Shami – Politics : రాజకీయాల్లోకి క్రికెటర్ షమీ.. ఏ పార్టీ.. ఏ స్థానం ?
Shami - Politics : మరో స్టార్ క్రికెటర్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడు.
- Author : Pasha
Date : 08-03-2024 - 6:16 IST
Published By : Hashtagu Telugu Desk
Shami – Politics : మరో స్టార్ క్రికెటర్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షమీ తన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం షమీని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సానుకూలంగా జరిగాయని, పార్టీ ప్రతిపాదనపై షమీ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దించాలని బీజేపీ(Shami – Politics) భావిస్తోందట. అక్కడ పెద్దసంఖ్యలో ఉన్న మైనార్టీల ఓట్లను ఆకర్షించాలని బీజేపీ అనుకుంటోందట. ప్రస్తుతం బసిర్‌హత్ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ తరఫున నుస్రత్ జహాన్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సందేశ్‌ఖాలీ ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలోనిదే కావడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
చీలమండ గాయం కారణంగా షమీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయనకు లండన్‌లో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈవిషయాన్ని తెలుపుతూ మహ్మద్ షమీ చేసిన ట్వీట్‌కు ఏకంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా స్పందించారు. ‘‘షమీ వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకొని దేశం తరపున ఆడాలని కోరుకుంటున్నాను’’ అని మోడీ ట్వీట్ చేశారు. గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రధాని మోడీ టీమిండియా ఆటగాళ్లను కలిసి ఓదార్చిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన షమిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : Fifth Marriage : మర్దోక్ పెళ్లికొడుకాయెనె.. 93 ఏళ్ల ఏజ్‌లో ఐదో పెళ్లి.. ఎవరితో ?
ఒకప్పుడు భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు, కోర్టు సమన్లు, ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు, రోడ్డు ప్రమాదం.. ఇలా ఒకటా రెండా షమీని ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ దృఢంగా తయారయ్యాడు. కుటుంబ విభేదాల వల్ల కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్ జహాన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి, మాట్లాడటానికి తనను అనుమతించడం లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడుతున్నానని ఆయన తెలిపాడు. ‘‘ఎవరూ తన కుటుంబాన్ని, పిల్లలను కోల్పోవాలనుకోరు. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు’’ అంటూ షమీ ఆవేదన వ్యక్తం చేశాడు.