PBKS beat LSG: లక్నోకు పంజాబ్ పంచ్.. ఉత్కంఠ పోరులో కింగ్స్ విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ కు పంజాబ్ కింగ్స్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠ పోరులో లక్నోపై పంజాబ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Author : Naresh Kumar
Date : 15-04-2023 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
PBKS beat LSG: ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ కు పంజాబ్ కింగ్స్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠ పోరులో లక్నోపై పంజాబ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనూహ్య మలుపులు తిరుగుతూ సాగిన ఈ పోరు అభిమానులను అలరించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తమ ఇన్నింగ్స్‌ను స్లోగా ప్రారంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ధాటిగా ఆడే క్రమంలోనే కైల్ మేయర్స్ ఔటయ్యాడు.
ఇక్కడ నుంచి లక్నో ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఒకవైపు కెప్టెన్ కెఎల్ రాహుల్ నిలదొక్కుకున్నా.. మిగిలిన బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు.పేలవ ఫామ్ లో ఉన్న దీపక్ హుడా మరోసారి సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. అయితే కృనాల్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రాహుల్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు కృనాల్ తో కలిసి 48 పరుగులు జోడించారు. తర్వాత కృనాల్, పూరన్ వెంటనే వెంటనే ఔటవడంతో లక్నో స్కోర్ వేగం తగ్గింది.చివర్లో స్టోయినిస్ ధాటిగా ఆడకుంటే ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. రాహుల్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 74 రన్స్ చేశాడు. చివర్లో పంజాబ్ బౌలర్లు లక్నో జోరుకు కళ్ళెం వేశారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 159 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో శామ్ కరన్ 3 , రబాడ 2 వికెట్లు పడగొట్టారు.
ఛేజింగ్ లో పంజాబ్ కూడా తడబడింది. తొలి ఓవర్ లోనే అథర్వ డకౌవటగా.. కాసేపటికే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా ఔటయ్యాడు. అయితే మాథ్యూ షార్ట్ , హర్ ప్రీత్ సింగ్ ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరి పార్టనర్ షిప్ తో కోలుకున్నట్టే కనిపించింది. స్వల్ప వ్యవధిలో షార్ట్ 34 , హర్ ప్రీత్ 22 రన్స్ కు ఔటయ్యారు. ఈ దశలో సికిందర్ రాజా పంజాబ్ ను ఆదుకున్నాడు. ఆరంభంలో సింగిల్స్ కే పరిమితమైనప్పటికీ క్రమంగా బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలో మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో సాధించాల్సిన రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన సికిందర్ రాజా కీలక సమయంలో ఔటవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. శామ్ కరన్, జితేశ్ శర్మ , హర్మీత్ బ్రార్ వెంటవెంటనే ఔటవడంతో లక్నో గెలిచేలా కనిపించింది. అయితే ఒత్తిడిలో అద్భుతంగా ఆడిన షారూఖ్ ఖాన్ స్ట్రైకింగ్ తానే తీసుకుని పంజాబ్ ను గెలిపించాడు. దీంతో పంజాబ్ మరో మూడు బంతులు మిగిలుండగా టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ పంజాబ్ కు ఇది మూడో విజయం.
Shahrukh Khan gets @PunjabKingsIPL over the line 🔥🔥
What a finish to an epic chase 🙌
Scorecard ▶️ https://t.co/OHcd6VfDps #TATAIPL | #LSGvPBKS pic.twitter.com/jGzGulGL45
— IndianPremierLeague (@IPL) April 15, 2023