IPL 2022 : ఐపీఎల్ కు ఫాన్స్ ఎంట్రీపై బీసీసీఐ కీలక నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ స్వదేశంలోనే జరగనుంది. దీనిపై ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపిన ఐపీఎల్ పాలకమండలి, ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికొచ్చినట్టు సమాచారం.
- By Hashtag U Published Date - 10:44 AM, Mon - 31 January 22

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ స్వదేశంలోనే జరగనుంది. దీనిపై ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపిన ఐపీఎల్ పాలకమండలి, ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికొచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ సారి ఐపీఎల్ రెండు రాష్ట్రాలకే పరిమితం కానుంది. కోవిడ్ కారణంగా గత రెండు సీజన్లూ యుఏఈలో జరిగాయి. గత సీజన్ ముందు భారత్‌లోనే జరిగినా కోవిడ్ వైరస్ బబూల్‌లోకి ప్రవేశించడంతో మధ్యలోనే నిలిచిపోయింది. అనేక తర్జనభర్జనల అనంతరం యుఏఈ వేదికగా బీసీసీఐ సీజన్‌ను పూర్తి చేసింది. అయితే 15వ సీజన్‌ను మాత్రం స్వదేశంలోనే జరపాలని అటు ఫ్రాంచైజీలు, ఇటు బీసీసీఐ భావిస్తున్నాయి. దేశంలో కోవిడ్ కేసులు గత కొన్నిరోజులుగా ఎక్కువగానే ఉన్నప్పటికీ… సీజన్ ప్రారంభ సమయానికి థర్డ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గుతుందన్న అంచనాల మధ్య ఇక్కడే మ్యాచ్‌లు జరిపేందుకు ప్లాన్ చేసుకుంటోంది. దీనిలో భాగంగా 15వ సీజన్‌ను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయనున్నట్టు సమాచారం. కోవిడ్ ప్రభావంతో బబూల్ ఏర్పాట్లకు ఇబ్బంది లేకుండా మహారాష్ట్ర, అహ్మదాబాద్‌లలో లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. లీగ్ దశ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనూ, ప్లే ఆఫ్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.
ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్ , డీవై పాటిల్ , పుణే స్టేడియాల్లో లీగ్ స్టేజ్ జరగనుండగా.. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే మ్యాచ్‌లకు అభిమానులను అనుమతించడం పైనా బీసీసీఐ ఆలోచిస్తోంది. అప్పటికి కోవిడ్ ప్రభావం తగ్గితే 25 నుండి 50 శాతం సామర్థ్యంతో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు జరగనున్న మెగా వేలంపైనా సందిగ్ధత వీడింది. కర్ణాటకలో ఆంక్షలు సడలించడంతో ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ వేలానికి ఏర్పాట్లను చేసుకుంటోంది. కాగా కోవిడ్ పరిస్థితిలో మార్పు రాకుంటే మాత్రం ఐపీఎల్ ఆతిథ్యం కోసం సౌతాఫ్రికాను మొదటి ఆప్షన్‌గా ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే క్రికెట్ సౌతాఫ్రికా ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టు బీసీసీఐకి లేఖ రాసింది. అయితే తమ తొలి ప్రాధాన్యత మాత్రం స్వదేశానికేనని బీసీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పైనే అది ఆధారపడి ఉంది.